Sunday, January 15, 2012

జయకళ శశిలలిత! * Inner View

ప్రాణానికి ప్రాణం అనుకున్న శశికళను బయటికి గెంటేస్తూ
జయ ఎందుకంత నిష్కర్షమైన నిర్ణయం తీసుకున్నారు?
పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జయ హృదయంలో తనకున్న ప్రత్యేక స్థానాన్ని కూడా శశికళ ఎందుకు పోగొట్టుకోవలసి వచ్చింది? అసలు జయకు, శశికి మధ్య ఏమిటంత స్నేహం? ఎందుకంత స్నేహం? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఇన్నర్‌వ్యూ.


అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ గుర్తులో కనిపించే ఆకుపచ్చని జంట ఆకుల్లా ఇంతకాలం వర్థిల్లిన జయ, శశిల స్నేహం ఇప్పుడు ‘ఏకాకు’లా మిగిలింది!

రాజకీయాలలో స్నేహం కానీ, శత్రుత్వం కానీ శాశ్వతం కాదని అంటారు. అయితే గత డిసెంబర్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తన అనుంగు నె చ్చెలి శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా బయటికి పంపించడాన్ని బట్టి చూస్తే - పాతికేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహ సాన్నిహిత్యం శాశ్వతంగా ముగిసినట్ల్లే కనిపిస్తోంది.


శశికళను బహిష్కరించిన ఐదురోజుల తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో తొలిసారిగా మౌనం వీడిన జయ... ‘నమ్మక ద్రోహులకు పార్టీలో చోటు లేదు’ అని ఒకప్పటి తన ‘సిస్టర్ ఇన్ స్పిరిట్’ (స్నేహోదరి) ను ఉద్దేశించి కరాకండిగా వ్యాఖ్యానించడం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది! నిజానికి జయ, శశిల మధ్య ఇన్నేళ్లూ కొనసాగింది రాజకీయాలకు అతీతమైన స్నేహానుబంధం. దాన్ని కూడా కాదనుకుని శశికళపై చర్య తీసుకున్నారు జయ. ‘‘ఇవాళ్టి నుంచి నువ్వు అన్నాడిఎంకెలో భాగం కాదు.. ఫో’’ అని అధికారికంగా అనడమైతే అన్నారు కానీ, అంతరార్థం మాత్రం ‘ఇవాళ్టి నుండి నువ్వు నాలో భాగం కానే కాదు’ అని స్నేహానికి నీళ్లొదులుకోవడమే.

ఐదేళ్ల నిరధికార విరామం తర్వాత గత ఏడాది మే 16న తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి పట్టాభిషిక్తురాలైన ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయిక) జయలలిత... తనెంతో కష్టపడి సాధించుకున్న పదవిని కాపాడుకోవడం కోసం చివరికిలా తన ఇష్టసఖినే ఫణంగా పెట్టవలసి వస్తుందని ముందెన్నడూ ఊహించి ఉండరు! స్నేహితురాలికి సర్వం దోచిపెట్టిన జయలలితకు... ఇప్పుడా స్నేహితురాలి నుంచే తన రాజకీయ అధికారాన్ని సంరక్షించుకోవలసిన అగత్యం ఏర్పడింది.


ప్రాణసమానం అనుకున్న శశికళ తనను నట్టేట ముంచేందుకు పార్టీ కార్యాలయంలో పావులు కదుపుతున్న విషయం తెలిసి జయ ఆమెకు చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇందుకు వారు చూపుతున్న నిదర్శనాలు జయ కటౌట్‌లా నిలువెత్తుగా కనిపిస్తున్న ప్పటికీ అంతకన్నా ఎత్తైది వారి స్నేహానుబంధం.

అనుకోని అనుబంధం
జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా, అది పోయస్ గార్డెన్‌కే పరిమితం అయ్యింది. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో స్నేహం బహిర్గతమయ్యింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల దుకాణం నడుపుతున్న శశికళకు ప్రభుత్వోద్యోగి అయిన ఆమె భర్త నటరాజన్ ద్వారా జయలలితతో పరిచయభాగ్యం కలిగింది.
అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో కూడా పట్టు దొరికింది. 


జయలలిత, శశికళ, చంద్రలేఖ


 









ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆంతరంగికురాలిగా మారిన శశికళల మధ్య స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం చంద్రలేఖ అనే మరో మహిళ. చంద్రలేఖ దక్షిణ ఆర్కాట్ జిల్లాకు అప్పట్లో కలెక్టర్‌గా ఉండేవారు. అదే జిల్లాకు పౌర సంబంధాల అధికారి (పి.ఆర్.ఓ)గా శశికళ భర్త నటరాజన్ ఉండేవారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రభుత్వం కొంతమంది పి.ఆర్.ఓ.లను చెట్టుకొకర్ని, పుట్టకొకర్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యడంతో నటరాజన్... పన్నీర్‌శెల్వం అనే మరో అధికారితో కలిసి కోర్టుకెక్కారు.

ఆ సమయంలోనే జీవనోపాధి కోసం నటరాజన్ తన భార్య శశికళ చేత వీడియో పార్లర్ పెట్టించాడు. చివరికి కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో నటరాజన్‌కు 1980లో తిరిగి పి.ఆర్.ఓ.గా ఉద్యోగం లభించింది. సరిగ్గా అప్పుడే భర్త ద్వారా శశికళకు కలెక్టరు చంద్రలేఖ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో శశికళ తరచు చంద్రలేఖ ఇంటికి వెళ్లి కష్టాలను వెళ్లబోసుకునేవారు. సంపాదన చాలకపోవడంతో శశికళ కొంత డబ్బు అప్పు చేసి సింగపూరు వెళ్లి, వీడియో కెమెరాలు తెచ్చుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

అన్నాడిఎంకె పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితను తనకు పరిచయం చేయాలని చంద్ర లేఖను శశికళ కోరారు. అలా చంద్రలేఖ పరిచయం చేయడంతో పార్టీకి చెందిన కార్యక్రమాలను వీడియో, ఫోటోలు తీసే పనులను జయ శశికళకు అప్పగించారు. పనితీరు బాగుండటంతో శశికళను మళ్లీ మళ్లీ పిలిపించి కార్యక్రమాలు అప్పగించేవారు. అయితే జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు. ఒక పట్టాన ఎవరినీ నమ్మరు.


అలాంటిది ఒక సాధారణ గృహిణి, చదువులేని మహిళ అయిన శశికళను ఆమె ఎందుకు చేరదీశారన్నది ఇంకో ప్రశ్న. అయితే శశికళలో ఉండే ప్లస్ పాయింట్లు శశికళలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె ఘటికురాలు. సాటి మనిషికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కూడా. ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే, అందులో జోక్యంచేసుకోరు, వారు చెప్పేదంతా శ్రద్ధగా వింటారు. ఈ స్వభావం ఉన్న వారిని సాధారణంగా ఎవరైనా ఇష్టపడతారు. జయలలిత కూడా బహుశా అందుకే ఆమెను చేరదీసి ఉండొచ్చు.


‘కళ’ తప్పిన స్నేహం

1996 ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓడిపోయి డిఎంకె అధికారంలోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై జయ, శశి జైలుపాలయ్యారు. అప్పటి వరకు శశికళ పార్టీ సభ్యురాలు కూడా కాదు. జయ వెంట ఎక్కడా కనిపించేవారు కాదు. 2001 శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారి బహిరంగంగా జయలలిత వెంట శశికళ ప్రత్యక్షమయ్యారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండగనే 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని శశికళకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే శశికళకు పార్టీ సభ్యత్వం లేకపోవడం, ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని ఆశించలేక పోయారు. దాంతో ఆమె సూచించిన పన్నీరుశెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత నిర్దోషిగా బయట పడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. తరువాత పార్టీలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కోర్‌కమిటీ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీలోను, ప్రభుత్వంలోను శశికళ వర్గీయులదే పైచేయిగా నిలిచింది. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది.


‘రాజకీయమే’ అసలు కారణం!

నిరుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి జయలలిత, శశికళల మధ్య విభేదాలు తలెత్తాయి. శాసనసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు తన సొంత వర్గానికి చెందిన కొంతమందికి జయలలితకు తెలియకుండానే శశికళ సీట్లు కేటాయించుకున్నారు. దాంతో జయ ఆ జాబితాను రద్దు చేసి, కొత్త జాబితాను విడుదల చేశారు.

అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిగింది. పార్టీలో ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, శశికళ తమ బంధువర్గానికి సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ పోయస్ గార్డెన్‌లోని శశికళ ఇంటి ముందు కూడా కార్యకర్తలు ఆందోళనలు చేశారు.


పరిపాలనలోనూ జోక్యం!

రాష్ట్ర పరిపాలనలో కూడా శశికళ జోక్యం ఎక్కువయింది. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం, టెండర్లు ఫలానా వారికే ఇవ్వాలని ఒత్తిడి తేవడం వంటివి కూడా జరిగాయి. ఈ కారణంగా కొందరు ఐఎఎస్ అధికారులు శెలవులు పెట్టి వెళ్లిపోయిన విషయాన్ని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జయలలితకు ఫిర్యాదులు అందాయి. అప్పుడే కొంతమంది మంత్రులపై జయ వేటు వేశారు.

భర్త కోసం శశి వ్యూహం!

జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసు ప్రస్తుతం బెంగుళూరు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు వ్యవహారంలో కూడా స్నేహితురాళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. జయలలిత కోర్టుకు హాజరయినపుడు, న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధించారు. వాటిలో చాలా వరకు తనకు తెలియదని, అవన్నీ తన పేరు చెప్పుకుని తన చుట్టూ ఉన్నవారు చేశారని జయలలిత చెప్పారు.

తనపేరు మీద ఉన్న ఆస్తులన్నీ శశికళకు చెందినవేనని అన్నట్లు కూడా బయటికి పొక్కింది. అదే విధంగా శశికళ కూడా తనకేమీ సంబంధం లేదని, అంతా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితకు చెందిన ఆస్తులేనని తెగేసి చెప్పారు.


రేపో మాపో బెంగుళూరు కోర్టులో గనుక జయలలితకు ప్రతికూలమైన తీర్పు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆమె వైదొలగవలసి ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలి. ఆ బాధ్యతలను తన భర్త నటరాజన్‌కు కట్టబెట్టాలని శశికళ జయలలితను కోరినట్లు వినికిడి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శంకర్ కోవిల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నటరాజన్‌కు టిక్కెట్టు ఇచ్చి, గెలిపించాలని జయను శశి కోరారు.


2002లో ఇదే కేసులో జయను దోషిగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చి జైలు శిక్షను విధించింది. అప్పుడు శశికళ సామాజిక వర్గానికి చెందిన పన్నీరుశెల్వంను ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు ఆరు నెలల పాటు పన్నీరుశెల్వం ముఖ్యమంత్రిగా పని చేశారు. తరువాత జయను కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే పరిస్థితి మరోసారి ఉత్పన్నమవుతుందని శశికళ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ తన బంధువర్గంతో పలుసార్లు సమావేశమయ్యారు.


జయలలిత కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఆ పదవిని నటరాజన్‌కు ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. సమావేశంలో నటరాజన్‌తో పాటు శశికళ బంధువర్గం రావణన్, వెంకటేశన్, దివాకరన్, భాస్కరన్, మరి కొంతమంది ఉన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఇరవై మంది శశికళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం జయ చెవిలో పడింది. పర్యవసానమే శశి, ఆమె అనుచరుల బహిష్కరణ.


ఇంత అకస్మాత్తుగా శశికళను జయ దూరం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. జయ చాటున శశికళ మిన్నాగు పన్నాగాలు పన్నగలరని కూడా ఎవరూ అనుకోలేదు. రెండు దశాబ్దాలకు పైబడిన వీరిద్దరి ఆత్మీయ అనుబంధంలో ఇంతవరకు ఉల్లాసాలు తప్ప విరుపులు లేవు. నిజానికి జయ ఔదార్యమే వీరి స్నేహాన్ని నిలిపింది.


 
ఆమె చెప్తే ‘అమ్మ’ చెప్పినట్లే














అన్నాడిఎంకె పార్టీలో ఇద్దరు అధినేత్రులు! ఒకరు ప్రధాన కార్యదర్శి జయలలిత, మరొకరు ఆమె సన్నిహితురాలు శశికళ. వారిద్దరిది ఇరవై ఏళ్లకు పైబడిన అనుబంధం. పార్టీలోను, ప్రభుత్వంలోను, జయ నివాసం పోయస్ గార్డెన్‌లోను శశికళకు అగ్రతాంబూలమే. అధికారులు జయలలితకు ఎంత విలువ ఇస్తారో, అంతే విలువను శశికళకూ ఇవ్వాల్సిందే.

జయలలిత వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లినా, అధికారిక పర్యటనలో ఉన్నా శశికళ ఆమె పక్కన ఉండాల్సిందే. చివరికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ప్రచార వాహనంలో వెనక సీటులో శశికళ ఉంటారు. పార్టీలో జయలలితకు తెలియని విషయాలయినా ఉంటే ఉండవచ్చు కాని, శశికళకు తెలియని విషయాలు ఉండవని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జయలలిత నీడ శశికళ. 1991-96 మధ్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి.


కవలు పిల్లలు ఏ విధంగా ఒకే డ్రస్ వేసుకుంటారో, అదే విధమైన దుస్తులు ధరించేవారు. 1996లో జైలుకు కూడా కలిసే వెళ్లారు. అటువంటి స్నేహం వారిద్దరిదీ. ఒక దశలో శశికళ జయకు సమయం కేటాయించడం కోసం తన భర్తను కూడా నిరాదరించారు. 1996 శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె పరాజయానికి శశికళ, ఆమె బంధువర్గమే కారణమని ఆరోపణలు వచ్చినప్పుడు శశికళను కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచిన జయలలిత మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. 2003లో శశికళకు పార్టీలో తొలిసారిగా ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి ఎగ్జిక్యూటివ్ కోర్ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు.


అమలిన స్నేహం

 







ఇరవై ఏళ్ల స్నేహ బాంధవ్యంలో, రాజకీయ సాంగత్యంలో జయలలితగానీ ఆమె ప్రియబాంధవి శశికళగానీ ఒకరి గురించి ఒకరు నోరు మెదిపిన సందర్భం ఒక్కటైనా లేదు! ఇంటర్వ్యూలలో శశికళ ప్రస్తావన వచ్చినప్పుడు జయ ‘నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అన్నట్లు చూసేవారు. జయ గురించి శశకళను అడిగే ధైర్యమైతే అసలు పార్టీలో ఎవరికీ ఉండేది కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఊహలు, వదంతులు చుట్టుముట్టినప్పుడు కూడా వీళ్ల స్నేహం తొణకలేదు. తత్తరపడలేదు. శశికళ ఒంటి మీద ప్రతి తులం బంగారానికీ ప్రత్యుర్థులు జయనే లెక్క అడిగేవారు.

శశి వెనకేసుకున్న ప్రతిరూపాయి పైనా వారికి జయ బొమ్మే కనిపించేది. ఎన్నికల ప్రచారంలో జయ వెంట శశికళ ఉండడం, ఒక చిన్న వేడుకలో వారిద్దరూ ఆత్మీయంగా దండలు మార్చుకోవడం, శశికళ మేనల్లుడి వివాహాన్ని జయ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించడం వంటి వాటిని కూడా బద్ధ విరోధ డి.ఎం.కె.పార్టీ రాష్ర్ట సమస్యలుగా చిత్రీకరించినప్పుడూ ఈ అపూర్వ స్నేహితులు ఖాతరు చేయలేదు.


అయితే ఇవే అంశాలపై వారు 1996 ఎన్నికల్లో ప్రజాతీర్పును మన్నించవలసి వచ్చింది! ఎన్నికల ప్రచారానికి శశికళను వెంటేసుకుని వెళ్లినప్పుడు జయకు బ్రహ్మరథం పట్టిన తమిళనాడు ప్రజలు ఆ అభిమానాన్ని తమ ఓటు ద్వారా చాటలేకపోయారు! మేనల్లుడి పెళ్లిలో ఒంటి నిండా నగలతో టీవీలలో ఆడంబరంగా కనిపించిన శశికళను నేరుగా చూసేందుకే జనం ఎగబడ్డారనీ, నిజానికి వారికి శశికళ తీరు నచ్చక ఆ కోపాన్ని జయపైన చూపించి ఆమెను ఓడించారని మీడియాలో వార్తకథనాలు వచ్చాయి.


అయినప్పటికీ శశి చేతిని జయ వదల్లేదు. అంతగా తను నమ్మి, ప్రేమించి అభిమానించిన మిత్రురాలు తనకు ద్రోహం చేస్తోందన్న వాస్తవాన్ని తట్టుకోలేకే చివరికి ఒక్క బహిష్కరణ సంతకంతో తన మనసులోంచి ఆమె ముద్రను చెరిపేసుకున్నారు జయలలిత!

- సి.బి.మోహన్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి, చెన్నై

ఫొటోలు: వన్నె శ్రీనివాసులు

No comments:

Post a Comment