Monday, January 31, 2011

గణతంత్రమా ? కు(టుంబ)తంత్రరాజ్యమా?


india-poltics
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీర్తి అందుకుంటున్న భారత దేశంలో రాచరికపు, వారసత్వ లక్షణాలు బలపడడం ఒక వైచిత్రి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది. పార్లమెంటే కాదు అనేక రాష్ట్ర అసెంబ్లీలలో పరిస్థితి ఇదే. అంతెందుకు? మన రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న ప్రజాస్వామిక నిర్వచనం ఇక్కడ పని చేయడం లేదు. కుటుంబం కొరకు, కుటుంబం వలన, కుటుంబం చేత నాయకులు తయారవుతున్నారు.

ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మరణిస్తే ఆ స్థానాన్ని మరో దీటైన నాయకుడితో నింపకుండా భార్యకో, కుమారిడికో ఇవ్వడం దానిని వారి కుటుంబ జమీన్‌లా కట్టబెట్టడం వెనుక రాజకీయ పార్టీల నిస్సహాయత, స్వార్థమూ రెండూ కనిపిస్తాయి. ఒక నాయకుడు కష్టపడి పైకి ఎదిగి ఒక స్థానాన్ని సాధించుకోవడం వెనుక అతడి శ్రమ, నిబద్ధత రెండూ ఉంటాయి. అయినంత మాత్రాన అతడు మరణించగానే ఆ స్థానాన్ని కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని చూడడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.

list1 ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్‌ గాంధి కొడుకు రాహుల్‌, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్‌ , మాధవ్‌రావ్‌ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్‌ పైలెట్‌ కొడుకు, ఒమర్‌ అబ్దుల్లా బామ్మర్ది సచిన్‌, ఫరూక్‌ అబ్దుల్లా కొడుకు, షేఖ్‌ అబ్దుల్లా మనవడు ఒమర్‌ అబ్దుల్లా, ములాయమ్‌ సింగ్‌ యాదవ్‌ కొడుకు అఖిలేశ్‌, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్‌సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది.

ఇప్పటి యువ నాయకులు ప్రపంచం చుట్టివచ్చారు. ప్రతిభపై ఆధారపడ్డ కొత్త కార్పొరేట్‌ సంస్కృతిని అలవరుచుకున్నారు. ఆధునిక భారతదేశాన్ని అవతరింపచేయడం కోసం కృషిచేసినవారి వారసులుగా వీరిని వీరు పరిగణించుకుంటున్నారు. ఏ దిక్కుకేసి చూచినా కుటుంబరాజకీయాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దాని ఫలితాలు చాలా స్వల్పమైనవి.

list లక్షద్వీప్‌ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్‌ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్‌పవార్‌ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది.

రాజకీయాల్లో బంధుప్రీతి ఎంతగా పాతుకుపోయిందంటే ప్రజాస్వామ్యంపై దాని ప్రభావాన్ని అంచనా వేయలేము. వంశానుగత వారసత్వ రాజకీయాలు ఎంత లోతుగా పాతుకుపోయిందో ఊహకందదు.
ఈ కుటుంబ వ్యవస్థ వల్ల మంచి సత్తా ప్రతిభ వున్న వారు మొగ్గ దశలోనే రాజకీయరంగానికి దూరమవుతున్నారు. ఇక్కడ సమస్య వారసత్వం మాత్రమే కాదు. ప్రముఖ నాయకుడి పిల్లల్ని, వితంతువుల్ని, బామ్మర్దుల్ని రంగంలోకి దింపి కుటుంబం అధికారాన్ని బలోపేతం చేసుకుం టున్నాయి రాజకీయ పార్టీలు. అర్హులు కాకపోయినా ప్రముఖ నాయకుల పిల్లలు రాజకీయల్లోకి ప్రవేశించాలని ఆశిస్తారు.

వారసత్వం అధికంగా ఉన్న పార్టీలు...
farukhపార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్‌పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు.

ఇది ప్రాంతీయ అంశమా..
ఇక్కడే విభిన్న రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. పంజాబ్‌,ఢిల్లీ, హర్యానాల్లో కుటుంబ రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయి. ఆ తర్వా త గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ కాక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 75 శాతం పైచిలుకు ఎంపీ లు వారసత్వేతర నేపథ్యానికి చెందినవారని తెలుస్తోంది. సాధారణంగా ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి 2000 సంవత్సరంలో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రాల్లో బంధుప్రీతి అంత గా లేదని చెప్పుకోవాలి. కుటుంబ రాజకీయాలు బలపడ్డానికి సమయం బహుశా సరిపోలేదు.


రాష్ట్రంలో సంచలన వారసత్వం
ap-pమన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్‌కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.

mchannareddy లోక్‌సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉత్తర భారతమంతటా శాసన సభ్యులు తమ పిల్లల్ని, పెళ్ళాల్ని వారసులుగా నియమిస్తున్నారు. 38 అతి కుర్ర ఎంపీల్లో 33 మంది మమ్మీ-డాడీ సహాయంతో వచ్చినవారే. మిగతా 5గురిలో ఒకరు రాహుల్‌ ఎంపిక చేసిన మీనాక్షి నటరాజన్‌. మరో ముగ్గురు స్వయం కృషితో పైకి వచ్చిన బిజెపి,బిఎస్‌పి ,సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు. మరొక సభ్యుడు మాయావతి ఎంపిక చేసిన వారు.

దక్షిణాదిలో బలమైన వంశ వృక్షం
south-polticsదక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.

సుదీర్ఘకాల వారసులు ఎక్కువ సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ లో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. వలస పాలకులు మన రాజ్యాధికారాన్ని దేశంలోని రాజరిక కుటుంబాలకు హస్తగతం చేయకూడదన్న నిజం పునాదిగా భారత గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. కానీ తీరా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌ సభ కాక ఒక వంశ సభ ఆవిర్భవించినట్టు కనిపిస్తోంది. వారసత్వ పాలన రాకుండా ఉండేందుకు నెహ్రూ,పటేల్‌,వి.పి.మీనన్‌ తదితరులు బృహత్తరమైన కృషిచేశారు. 554 రాజరిక రాజ్యాలు ఆధునిక ప్రజాస్వామిక దేశంలో విలీనం చేయడానికి పాటుపడ్డారు. దేశంలో సర్వసత్తాక అధికారం ప్రజాపరంగానే వుండాలన్న సూత్రంగా స్వతంత్ర భారత రాజ్యాంగం ఆవిర్భవించింది.

కానీ ఈ రోజు దేశం కొత్తగా కొన్ని ప్రాంతాలుగా విడిపోయింది. కొన్ని స్థానిక కుటుంబాల చేతుల్లో రాజ్యాధికారం బందీ అయిపోయింది.

Thursday, January 6, 2011

తబలా మాంత్రికుడు !

చల్లని సాయంత్రం వేళ...మంచుతెరల దుప్పట్లు నెమ్మదినెమ్మదిగా పరుచుకునేటి సమయాన...తాజ్‌మహల్‌ పక్కన కూర్చుని తబలా వారుుద్యాన్ని వింటుంటే ఎవ్వరైనా సరే వహ్‌...వా! అనాల్సిందే...అదే మరి తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ భాయ్‌ అరుుతే తాజ్‌ చాయ్‌ తాగుతూ...దాని రుచిని ఆస్వాదిస్తూ తన ఒత్తైన రింగుల జుత్తుతో కూడిన తలను రిథమిక్‌గా ఆడిస్తూ వహ్‌...తాజ్‌! అంటుంటే ప్రశంసించని ఏ భారతీయుడూ ఉండడు... తబలా మాంత్రికుడిగా భారత కీర్తిపతాకానిన విశ్వవిఖ్యాతం చేసిన జాకీర్‌హుస్సేన్‌ గురించి క్లుప్తంగా...

zaki 
మనకున్న అతికొద్ది మంది తబలా వాయిద్యకారులలో ఈ తరం వారికి బాగా సుపరిచితమైన పేరు జాకీర్‌హుస్సేన్‌...1951 మార్చి 9న ముంబాయిలో జన్మించిన ఈ జాతిరత్నం తండ్రి కూడా మేలిమిజాతి వజ్రమే. అప్పటికే తబలా వాయిద్యంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన అల్లారఖాకు పుట్టిన వాడే మన జాకీర్‌హుస్సేన్‌. పులి కడుపున పులే పుడుతుందని...తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు జాకీర్‌. బాల్యంలో మహిం ప్రాంతంలోని సెయింట్‌ మైఖేల్‌ హైస్కూల్‌లో విద్యనభ్యసించిన జాకీర్‌ ముంబాయిలోని సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీనుంచి పట్టభద్రుడయ్యారు.

తండ్రే రోల్‌ మోడల్‌:
జాకీర్‌ ఇద్దరు అన్నలు తౌఫిక్‌ ఖురేషి, ఫజల్‌ ఖురేషిలకు ఇతడు ముద్దుల తమ్ముడు. అప్పటికే అన్నలిద్దరూ కూడా పెర్కూషన్‌ వాయించే కళాకారులు. కాగా జాకీర్‌ మాత్రం తన తండ్రినే రోల్‌మోడల్‌గా మలుచుకున్నారు. 12వ ఏటనుంచే తబలాను లయబద్ధంగా వాయించడం నేర్చుకున్నారు. 1970లో అమెరికాకు పయనమయ్యారు జాకీర్‌హుస్సేన్‌. అప్పుడే మొదలయ్యింది అంతర్జాతీయ వేదికలపై జాకీర్‌ ప్రస్థానం. 1973 సంవత్సర కాలంలో ఒకే సంవత్సరంలో 150కి పైగా ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు జాకీర్‌.

jakeerhussen 
1973లో జార్జిహారిసన్‌ లివింగ్‌ ఇన్‌ ద మెటీరియల్‌ వరల్డ్‌ ఆల్బమ్‌లో ప్రప్రధమంగా జాకీర్‌ చోటుదక్కించుకుని భారత జాతి ఖ్యాతి ఖండాంతరాలకి చాటిచెప్పారు. అంతేకాదు తబలా వాయిద్యంలో మొలకువల గురించి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో విద్యార్థులకు, భారత్‌లోని ముంబాయి విద్యార్థులకు టీచింగ్‌ చేసేవారు. బిల్‌లాస్‌వెల్‌కు చెందిన ప్రఖ్యాత వరల్డ్‌ మ్యూజిక్‌ సూపర్‌గ్రూప్‌లో తబలా శాస్త్రంలో అధ్యాపక సభ్యునిగా కొంతకాలం తన సేవలు అందించారు. గ్లోబల్‌ డ్రమ్‌ ప్రాజెక్ట్‌లో కూడా చురుగ్గా పాల్గొని పెర్కూషన్‌ వాయిద్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేవారు.

అంతర్జాతీయ వేదికలపై...
జాకీర్‌కు 1992లో భారత్‌లో ప్రఖ్యాత గాన కళాకారుల సరసన తబలా వాయించే అవకాశం దక్కింది. 2006లో భారతదేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ అవార్డును జాకీర్‌హుస్సేన్‌ ఎంపికయ్యారు. జాకీర్‌ హుస్సేన్‌తో పాటు ప్రఖ్యాత సరోద్‌ విద్వాంసుడు ఆశిష్‌ఖాన్‌ కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం విశేషం. ఈ ఇద్దరూ కూడా సంప్రదాయ దేశీయ వాయిద్యాలను లయబద్ధంగా వాయించి అశేష జనాలను రంజింపజేసినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికచేయడం విశేషం. ఇంకా అనేక అంతర్జాతీయ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ నిర్వాహకులతో కలిసి జాకీర్‌ పనిచేయడం...భారత ప్రతిష్టను దశదిశలా వ్యాపింపజేయడం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా భారత సంప్రదాయాలకు విలువనిస్తూ మన జాతి కీర్తి ప్రతిష్టల బావుటా అంతర్జాతీయ గగనతలంపై ఎగురవేస్తూ జాకీర్‌ తబలాకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.

2008లో అమెరికాతో సహా పలు దేశాలు పర్యటించి తన తబలా వాయిద్య శక్తికి ఎదురులేదని నిరూపించారు ఆయన. జాకీర్‌ స్వయంగా తబలా ఆలపించిన అనేక అంతర్జాతీయ ఆల్బమ్స్‌ అత్యంత ప్రాచుర్యం పొందాయి. 1991లో విడుదల చేసిన ‘ది ఫస్ట్‌ ప్లానెట్‌ డ్రమ్‌’ ఆల్బమ్‌ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు ఆ ఆల్బమ్‌కు బ్రహ్మరథం పట్టారు. ఆ ఆల్బమ్‌కు 1992లో ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు సైతం లభించింది. మళ్లీ ఆదేపేరుతో అనేక మార్పులు చేసి మళ్లీ కొత్తగా విడుదల చేసిన ఆల్బమ్‌కు 2009లో తిరిగి గ్రామీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. 2009, ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డ్స్‌ కార్యక్రమంలో జాకీర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

చలనచిత్రాలకు సంగీత సహకారం:
జాకీర్‌ బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలలోని పాటలకు, కొన్ని సన్నివేశాలకు కూడా తన తబలా వాయిద్యాన్ని అందించారు. 1983లో విడుదలైన హాలీవుడ్‌ సినిమా ‘హీట్‌ అండ్‌ డస్ట్‌’లో తొలిసారిగా తన వాయిద్యాన్ని పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ మర్చంట్‌ ఐవరీ ఫిల్మ్స్‌ నిర్మించింది. బాలీవుడ్‌లో స్వయంగా నటించి ఆ చిత్రానికి సంగీతాన్ని కూడా సమకూర్చారు జాకీర్‌. ఆ చిత్రం పేరు ‘వానప్రస్థం’. ఆ చిత్రం అనేక అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది.1999లో కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నామినేట్‌ అయింది.

ఏఎఫ్‌ఐ లాస్‌ఏంజిల్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా గ్రాండ్‌ జ్యూరీ అవార్డు పొందింది. ఇవేగాక టర్కీ దేశానికి చెందిన ఇస్థాంబుల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో, బొంబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో కూడా ఆ చిత్రం ప్రదర్శితమై విమర్శకుల ప్రసంశలు పొందింది. 2000లో భారతదేశంలో జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా ఎంపికయింది.

ఇదేగాక పలు భారతీయ చిత్రాలకు జాకీర్‌ తబలా వాయిద్య సంగీతాన్ని సమకూర్చారు. ‘లిటిల్‌ బుద్ద’ అనే చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలకు తబలా సంగీతాన్ని అందించారు. అపర్ణాసేన్‌ దర్శకత్వం వహించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయ్యర్‌’ చిత్రానికి సంగీత సహకారం అందించారు. కొన్ని చిత్రాలలో తానే స్వయంగా పాటలు పాడి అందరినీ విస్మయానందానికి గురిచేశారు. జాకీర్‌ పలు డాక్యుమెంటరీ చిత్రాలలో కూడా నటించారు. 1998లో ‘జాకీర్‌ అండ్‌ హిజ్‌ ఫ్రెండ్స్‌’, ‘జాకీర్‌హుస్సేన్‌ అండ్‌ది ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ డ్రమ్‌’ లాంటి డాక్యుమెంట్లతో సహా పలు డివీడీ చిత్రాలలో నటించి వాటికి సంగీత సహకారం అందించారు.

వ్యక్తిగతం:
జాకీర్‌ తాను స్వయంగా కళాకారుడేగాక ఆంటోనియా మిన్నేకోలా అనే కథక్‌ నృత్యకారిణిని వివాహమాడారు. ఆమె కథక్‌ నృత్యకారిణియేగాక నాట్యవిద్యాలయంలో టీచర్‌గా చేసేవారు. తర్వాత జాకీర్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే మేనేజర్‌గా కొంతకాలం పాటు వ్యవహరించారు. ఆ సందర్భంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారి అది పరిణయానికి దారితీసింది. వారికి అనీషా ఖురేషి, ఇసబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనీషా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ప్రస్తుతం ఫిలింమేకింగ్‌, వీడియో ప్రొడక్షన్‌ రంగాలను పర్యవేక్షిస్తోంది. ఇసబెల్లా మాన్‌హట్టన్‌లో సంప్రదాయ నృత్యానికి సంబంధించిన విద్యలో పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికీ జాకీర్‌ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో నిర్వహించే సెమిస్టర్స్‌కు పూర్తికాలం ప్రొఫెసర్‌గా మ్యూజిక్‌ విభాగంలో 2005-06 మధ్య పనిచేశారు.

పురస్కారాలు:
జాకీర్‌హుస్సేన్‌ లెక్కలేనన్ని దేశీయ, విదేశీయ అవార్డులు రివార్డులు అందుకున్నారు. 1998లో భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2002లో మరో ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డును కూడా అందుకోవడం విశేషం. అత్యంత పిన్నవయసులో అవార్డును అందుకున్న తబలా విద్వాంసుడిగా జాకీర్‌హుస్సేన్‌ను చెప్పుకోవచ్చు. అలాగే 1990లో అమెరికా-భారత దేశాల మధ్య సంప్రదాయ సత్సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈయనకు ‘ఇండో-అమెరికన్‌’ అవార్డును బహూకరించారు. 1991లో రాష్టప్రతి చేతులమీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డుకూడా అత్యంత పిన్నవయసులో అందుకున్న కళాకారుడిగా పేరుదక్కింది.

1992లో విడుదల చేసిన జాకీర్‌హుస్సేన్‌ విడుదల చేసిన ‘ప్లానెట్‌ డ్రమ్‌’ ఆల్బమ్‌ అంతర్జాతీయంగా విపరీతమైన క్రేజ్‌ తీసుకువచ్చి క్యాసెట్‌ అమ్మకాలలోనే ఓ వినూత్న రికార్డును సృష్టించి ప్రతిష్టాత్మక ‘గ్రామీ’ అవార్డును తెచ్చిపెట్టింది. భారతీయ సంగీతానికి లభించిన విశ్వవిఖ్యాతికి ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంచే 2006లో కాళిదాస్‌ సమ్మాన్‌ అవార్డు లభించింది. 2007 సంవత్సరంలో ‘మోడరన్‌ డ్రమ్మర్‌ అండ్‌ డ్రమ్‌’ మేగజైన్‌ నిర్వహించిన సర్వేలో ‘బెస్ట్‌ వరల్డ్‌ మ్యూజిక్‌ డ్రమ్మర్‌’గా జాకీర్‌హుస్సేన్‌ ఎంపికయ్యారు. భారతదేశ ఖ్యాతిని ఎల్లెడలా తన శాస్ర్తీయ సంగీత విద్యద్వారా వ్యాపింపజేసిన జాకీర్‌హుస్సేన్‌ మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలను అందుకుని మన జాతి కీర్తిపతాకాన్ని విశ్వవినతికెక్కించాలని...చరిత్రలో సువర్ణాధ్యాయాలతో మన పేరు లిఖించేలా చేయాలని ఆశిద్దాం...
1998లో భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ 2002లో పద్మభూషణ్‌ అవార్డును అందుకోవడం విశేషం. 1990లో అమెరికా-భారత దేశాల మధ్య సంప్రదాయ సత్సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఈయనకు ‘ఇండో-అమెరికన్‌’ అవార్డును బహూకరించారు. 1991లో రాష్టప్రతి చేతులమీదుగా సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు.
- నండూరి రవిశంకర్‌
జాకీర్‌ హుసేన్‌- క్యారికేచర్‌: మూర్తిగారి మధు

Monday, January 3, 2011

వాణిజ్య వారధి...ఈ రజని * స్ఫూర్తి... విజయం

ఈమె పేరు రజనీ వుడ్. ఉండేది ఆస్ట్రేలియాలో. హోదా.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్) వ్యవస్థాపక సభ్యురాలు, బోర్డ్ మెంబర్. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన ఈమె ఒకప్పుడు అశ్విని హెయిర్ ఆయిల్, ఆప్కో సంస్థలకు మోడల్‌గా కూడా పనిచేశారు. మణిశంకర్ తీసిన చాలా డాక్యుమెంటరీల్లో నటించారు.

ప్రస్తుతం చేస్తున్న పని.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ మెంబర్‌గా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూడ్డం. ఇదీ ఈమె పరిచయం. మొన్న జరిగిన ఎలీప్ వాళ్ల సెమినార్‌కు ఆస్ట్రేలియన్ ప్రతినిధిగా హైదరాబాద్‌కు విచ్చేసినప్పుడు ఆమె తన గురించి చెప్పిన విశేషాలు ...

'పదిహేనేళ్ల క్రితం టానీ పాల్ వుడ్ అనే ఆస్ట్రేలియన్‌ను పెళ్లి చే సుకుని అక్కడే స్థిరపడ్డాను. నాకు మొదటి నుంచి నైన్ టు ఫైవ్ ఉద్యోగాలంటే పెద్ద ఆసక్తి లేదు. కొత్తగా, అందరికి భిన్నంగా చేయగలిగే పనుల పట్లే శ్రద్ధ వహించేదాన్ని. అలా మొదలుపెట్టిందే సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్. దీన్ని స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాం.

నిజానికి ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా నడుస్తున్న సంస్థ. దీని తరపున ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూస్తున్నాం. అంటే ఇండియాలో ఉన్న ఉత్పత్తులకు ఆస్ట్రేలియాలో మార్కెట్ చూడడం, ఆస్ట్రేలియా వ్యాపారులకు ఇండియాలో అవకాశాలు చూపించడం మా పని. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడ్డమే కాకుండా కొత్త కొత్త ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది.

అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది ఇండియాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అందుకే మా సేవలకు మంచి గుర్తింపే లభిస్తోంది. అంతేకాదు మా సంస్థకు రెండుసార్లు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇది మేము సాధించిన విజయం.

కొత్త ఐడియా
ఎలీప్ వాళ్ల సెమినార్‌కి నాకు వక్తగా అహ్వానం అందింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక కొత్త ఐడియా మెరిసింది. ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో కొన్నిటిని ఆస్ట్రేలియన్ మార్కెట్‌కి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తట్టింది. అప్పుడు జనపనారతో తయారైన వస్తువులు నన్ను చాలా ఆకర్షించాయి.

పైగా ఆస్ట్రేలియన్లు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ప్లాస్టిక్ నిషేధం చాలా స్ట్రిక్టుగా అమలవుతోంది. అందుకని ఇక్కడ వీళ్ల చేత జనపనారతో సంచులను తయారుచేయించి వాటిని అక్కడ మార్కెట్‌లో అమ్మితే మంచి లాభాలు ఉంటాయి.

ఇట్లా అక్కడి వాళ్ల డిమాండు తీరుతుంది ఇక్కడ వీళ్ల వస్తువులకు మార్కెట్టూ దొరుకుతుంది. ఈ ఒక్కటే కాదు ఇలా ఆస్ట్రేలియా డిమాండున్న ఇతర వస్తువులకూ ఇక్కడ వీళ్ల చేత ఉత్పత్తి మొదలుపెట్టించి అక్కడ మార్కెట్ చేయాలన్నది నా సంకల్పం. అందుకే ఇప్పుడు ముందుగా నమూనాకు కొన్ని జ్యూట్ బ్యాగులను తీసుకెళ్తున్నాను. దాన్ని బట్టి మిగతావాటికి ప్రణాళిక వేసుకోవాలని అనుకుంటున్నాను.

ఆస్ట్రేలియాలో ఈ ఉత్పత్తుల డిమాండుననుసరించి చక్కటి నైపుణ్యం గల కొంతమంది వర్కర్లను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో నేను విజయం సాధించగలిగితే ఇక్కడి వర్కర్లను అక్కడికి తీసుకెళ్లినట్లే అక్కడ నైపుణ్యం ఉన్న వర్కర్లను కొంతమందిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. దీనివల్ల ఒకరి పనితనాన్ని ఇంకొకరు నేర్చుకునే వీలుంటుంది. అంటే ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. ఇదీ నా భవిష్యత్ ప్రణాళిక.

డాక్టర్ అవుదామని....
నిజానికి నేను డాక్టర్ అవుదామనుకుని చివరకు ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపకురాలినయ్యాను. సాధారణంగా ఇలా సినిమా యాక్టర్లు చెబుతారనుకుంటా. కాని నా విషయంలో కూడా జరిగిందదే. మెడిసిన్ చేద్దామనుకున్నాను. వయసు సరిపోలేదని ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అనుమతి దొరకలేదు.

ఖాళీగా ఉండడం ఎందుకని అప్పుడే హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరాను. ఆ చదువు పూర్తవడంతోనే కృష్ణా ఒబేరాయ్(ఇప్పటి తాజ్ కృష్ణా)లో ఉద్యోగం వచ్చింది.అదే నా లక్ష్యాన్ని మార్చింది. ఆ రోజుల్లోనే ఓ వైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు మోడలింగ్ చేసేదాన్ని. అప్పుడే టానీ పరిచయం అవడం, ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడమూ అయింది. ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్(స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవ

కాశం దొరికింది. ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.

ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

స్ఫూర్తి... విజయం
ఆ స్ఫూర్తితో కొంతమంది స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్)ను స్థాపించాను. దీని వ్యవహారాలు నడుపుతూనే ఆస్ట్రేలియా సమాజంలో ఉన్న రుగ్మతల మీద పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ డ్రగ్స్ బారిన పడే యువత చాలా ఎక్కువ. వాళ్లను గుర్తించి కౌన్సిలింగ్‌లు ఇప్పించడం, పునరావాస కేంద్రాల్లో చేర్పించడం, వాళ్లకు పనులు నేర్పించడం వంటివి చేస్తుంటాను మా సంస్థ తరపున.

అలా మాదకద్రవ్యాల అలవాటు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న కొంతమంది అమ్మాయిలు రకరకాల పనులు నేర్చుకుని చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి అమ్మాయిలనే కొంతమందిని ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్ కార్యక్రమంలో భాగంగా ఇండియాకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేపట్టిన చాలా పనుల్లో విజయాలే సాధించాను. ఇకముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయనే ఆశతోనే ముందడుగు వేస్తున్నాను.'
- సరస్వతి రమ

Saturday, January 1, 2011

మెరుపుల మిలమిలలు !

sachinఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్‌, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్‌బాస్‌-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్‌ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 50 సెంచరీలు, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ టాప్‌ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...

టెస్ట్‌ క్రికెట్‌లో 50 శతకాలతో రికార్డుల్లోకి...
క్రికెట్‌కు పర్యాయపదంగా మారారు సచిన్‌ టెండూల్కర్‌. ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ క్రికెట్‌లో ఎవరెస్ట్‌ శిఖరంగా నిలిచారు. రెండు దశాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతున్న సచిన్‌ ఎన్నో రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌లో ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పట్లో ఎవ్వరికీ సాధ్యం కాదు. సచిన్‌ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ రెండవ ఇన్సింగ్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో 50 శతకాలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 50 సెంచరీలతో ఏ టాప్‌ బ్యాట్స్‌మన్‌కు అందనంత ఎత్తులో ఆయన నిలిచారు. ఇక టెస్టుల్లో 50 వ సెంచరీని ఆయన తన తండ్రికి అంకితమిచ్చారు. త్వరలోనే సచిన్‌ వన్డేల్లో కూడా 50 సెంచరీలను పూర్తి చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తారు. ఈ రికార్డుకు చేరువలో సచిన్‌ ఉండడం మన దేశవాసులందరికీ గర్వకారణం.

బాలీవుగ్‌ టాప్‌ హీరోగా సల్మాన్‌ ఖాన్‌
salman-khanఈ ఏడాది బాలీవుడ్‌ టాప్‌ హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. సల్మాన్‌ ఇటీవలే 45వ బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్‌కు అమీర్‌ఖాన్‌కు ఉన్న యాక్టింగ్‌ స్కిల్స్‌, షారూఖ్‌ ఖాన్‌ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్‌ సినిమాలతో బాలీవుడ్‌ టాప్‌ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్‌ నటించిన దబంగ్‌ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతోపాటు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో యాంకర్‌గా చేసిన సల్మాన్‌కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లు, సల్మాన్‌ ఖాన్‌లు ఖాన్‌ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్‌ల త్రయంలో సల్మానే బెస్ట్‌గా నిలిచారు. ఇతర ఖాన్‌లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్‌ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్‌ ట్రేడ్‌ కన్సల్టెంట్‌ అమోద్‌ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్‌లో డబ్బింగ్‌ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్‌ హిట్‌ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్‌, గోల్‌మాల్‌ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్‌ కౌన్‌ హై...అంటే నేను సల్మాన్‌ ఖాన్‌ అని చెబుతాను. సల్మాన్‌ నటించిన వీర్‌ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్‌ సినిమాతో ఆయన టాప్‌స్టార్‌గా నిలిచారు’ అని ఆయన సల్మాన్‌ను పొగిడారు.

సల్మాన్‌ఖాన్‌తో పాటు గోల్‌ మాల్‌-3 సినిమా హీరో అజయ్‌దేవ్‌గన్‌ సైతం పాపులారిటీ సంపాదించుకున్నారు. దబంగ్‌, గోల్‌మాల్‌-3 సినిమాలు పెద్దమొత్తంలో కలె క్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది యంగ్‌ స్టర్‌ హీరోలు రణబీర్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లు తమ హిట్‌ సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

పెళ్లితో ఆనందమయ జీవితంలోకి..
Sania-Shoaibటెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్‌లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్‌తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్‌ గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్స్‌ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నే షనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్‌లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్‌ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్‌ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్‌ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్‌లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్‌ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్‌ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్‌‌స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్‌ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.

మేమిద్దరు క్రీడల్లో ఉన్నందున ఆయన నా సమస్యలను సులభంగా తెలుసుకొని ప్రోత్సహిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘టెన్నిస్‌లో సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ గేమ్స్‌ కూడా ఆడుతున్నాను. . నా దృష్టిలో అయతే ర్యాకింగ్స్‌ కేవలం నెంబర్స్‌ మాత్రమే. చక్కగా ఆడుతూ ముందుకు వెళ్తుంటే మంచి ర్యాంకింగ్స్‌ వాటంతట అవే వస్తాయి. ఎప్పటివరకైతే పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యవంతంగా ఉంటానో అప్పటి వరకు విజయాలు సాధిస్తాను. టెన్నిస్‌లో కొనసాగుతాను’ అని సానియా ధీమాగా చెప్పారు.

సెలబ్రిటీ జంటగా దీపికా, సిద్దార్థ మాల్యా...
dipeeka&sidduదేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్‌మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్‌ కింగ్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్‌ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ టీం యజమాని కూడా విజయ్‌మాల్యానే. ఇక విజయ్‌మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్‌లో తమ టీం బెంగళూర్‌ క్రికెట్‌ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్‌ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్‌గా ఉన్న బాలీవుడ్‌ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్‌ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్‌ వేడు కలను లండన్‌లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్‌ షాపింగ్‌ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్‌ తో కలిసి న్యూ ఇయర్‌ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్‌లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.

బిగ్‌ బాస్‌లో పమేలా సందడి...
andersonమన దేశంలోని పలు టివి ఛానెల్స్‌లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్‌ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్‌ను సాధించింది మాత్రం బిగ్‌ బాస్‌. దీని హోస్ట్‌గా సల్మాన్‌ ఖాన్‌ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్‌ బాస్‌-4లో సెలబ్రిటీ గెస్ట్‌గా హాలీవుడ్‌ ‘అందాల’ తార, బేవాచ్‌ గర్ల్‌ పమేలా ఆండర్సన్‌ సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్‌ నటి పమేలా ముంబయ్‌కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్‌ బాస్‌ 4 హౌస్‌లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్‌ బాస్‌ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె యానా గుప్తా ఐటమ్‌ సాంగ్‌ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్‌ మేట్స్‌ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్‌గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్‌ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్‌ పటేల్‌, హృషాంత్‌ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్‌ టివి ఛానెల్‌లో ప్రసారమైన బిగ్‌ బాస్‌-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

జీవిత భాగస్వామితో విడిపోయి...
liz-hurleyఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ ఉడ్స్‌ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్‌ ఉడ్స్‌ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్‌ ఉడ్స్‌ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్‌ సెలబ్రిటీ లిజ్‌ హర్లీ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ షేన్‌వార్న్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్‌ టైకూన్‌ అరుణ్‌ నాయర్‌ను పెళ్లి చేసుకున్న లిజ్‌ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్‌వార్న్‌తో జతకట్టింది లిజ్‌. ఈ జంట లండన్‌లోని ఓ హోటల్‌లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్‌ భర్త అరుణ్‌ నాయర్‌తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్‌వార్న్‌తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.