Monday, January 3, 2011

వాణిజ్య వారధి...ఈ రజని * స్ఫూర్తి... విజయం

ఈమె పేరు రజనీ వుడ్. ఉండేది ఆస్ట్రేలియాలో. హోదా.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్) వ్యవస్థాపక సభ్యురాలు, బోర్డ్ మెంబర్. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన ఈమె ఒకప్పుడు అశ్విని హెయిర్ ఆయిల్, ఆప్కో సంస్థలకు మోడల్‌గా కూడా పనిచేశారు. మణిశంకర్ తీసిన చాలా డాక్యుమెంటరీల్లో నటించారు.

ప్రస్తుతం చేస్తున్న పని.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ మెంబర్‌గా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూడ్డం. ఇదీ ఈమె పరిచయం. మొన్న జరిగిన ఎలీప్ వాళ్ల సెమినార్‌కు ఆస్ట్రేలియన్ ప్రతినిధిగా హైదరాబాద్‌కు విచ్చేసినప్పుడు ఆమె తన గురించి చెప్పిన విశేషాలు ...

'పదిహేనేళ్ల క్రితం టానీ పాల్ వుడ్ అనే ఆస్ట్రేలియన్‌ను పెళ్లి చే సుకుని అక్కడే స్థిరపడ్డాను. నాకు మొదటి నుంచి నైన్ టు ఫైవ్ ఉద్యోగాలంటే పెద్ద ఆసక్తి లేదు. కొత్తగా, అందరికి భిన్నంగా చేయగలిగే పనుల పట్లే శ్రద్ధ వహించేదాన్ని. అలా మొదలుపెట్టిందే సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్. దీన్ని స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాం.

నిజానికి ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా నడుస్తున్న సంస్థ. దీని తరపున ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూస్తున్నాం. అంటే ఇండియాలో ఉన్న ఉత్పత్తులకు ఆస్ట్రేలియాలో మార్కెట్ చూడడం, ఆస్ట్రేలియా వ్యాపారులకు ఇండియాలో అవకాశాలు చూపించడం మా పని. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడ్డమే కాకుండా కొత్త కొత్త ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది.

అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది ఇండియాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అందుకే మా సేవలకు మంచి గుర్తింపే లభిస్తోంది. అంతేకాదు మా సంస్థకు రెండుసార్లు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇది మేము సాధించిన విజయం.

కొత్త ఐడియా
ఎలీప్ వాళ్ల సెమినార్‌కి నాకు వక్తగా అహ్వానం అందింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక కొత్త ఐడియా మెరిసింది. ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో కొన్నిటిని ఆస్ట్రేలియన్ మార్కెట్‌కి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తట్టింది. అప్పుడు జనపనారతో తయారైన వస్తువులు నన్ను చాలా ఆకర్షించాయి.

పైగా ఆస్ట్రేలియన్లు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ప్లాస్టిక్ నిషేధం చాలా స్ట్రిక్టుగా అమలవుతోంది. అందుకని ఇక్కడ వీళ్ల చేత జనపనారతో సంచులను తయారుచేయించి వాటిని అక్కడ మార్కెట్‌లో అమ్మితే మంచి లాభాలు ఉంటాయి.

ఇట్లా అక్కడి వాళ్ల డిమాండు తీరుతుంది ఇక్కడ వీళ్ల వస్తువులకు మార్కెట్టూ దొరుకుతుంది. ఈ ఒక్కటే కాదు ఇలా ఆస్ట్రేలియా డిమాండున్న ఇతర వస్తువులకూ ఇక్కడ వీళ్ల చేత ఉత్పత్తి మొదలుపెట్టించి అక్కడ మార్కెట్ చేయాలన్నది నా సంకల్పం. అందుకే ఇప్పుడు ముందుగా నమూనాకు కొన్ని జ్యూట్ బ్యాగులను తీసుకెళ్తున్నాను. దాన్ని బట్టి మిగతావాటికి ప్రణాళిక వేసుకోవాలని అనుకుంటున్నాను.

ఆస్ట్రేలియాలో ఈ ఉత్పత్తుల డిమాండుననుసరించి చక్కటి నైపుణ్యం గల కొంతమంది వర్కర్లను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో నేను విజయం సాధించగలిగితే ఇక్కడి వర్కర్లను అక్కడికి తీసుకెళ్లినట్లే అక్కడ నైపుణ్యం ఉన్న వర్కర్లను కొంతమందిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. దీనివల్ల ఒకరి పనితనాన్ని ఇంకొకరు నేర్చుకునే వీలుంటుంది. అంటే ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. ఇదీ నా భవిష్యత్ ప్రణాళిక.

డాక్టర్ అవుదామని....
నిజానికి నేను డాక్టర్ అవుదామనుకుని చివరకు ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపకురాలినయ్యాను. సాధారణంగా ఇలా సినిమా యాక్టర్లు చెబుతారనుకుంటా. కాని నా విషయంలో కూడా జరిగిందదే. మెడిసిన్ చేద్దామనుకున్నాను. వయసు సరిపోలేదని ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అనుమతి దొరకలేదు.

ఖాళీగా ఉండడం ఎందుకని అప్పుడే హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరాను. ఆ చదువు పూర్తవడంతోనే కృష్ణా ఒబేరాయ్(ఇప్పటి తాజ్ కృష్ణా)లో ఉద్యోగం వచ్చింది.అదే నా లక్ష్యాన్ని మార్చింది. ఆ రోజుల్లోనే ఓ వైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు మోడలింగ్ చేసేదాన్ని. అప్పుడే టానీ పరిచయం అవడం, ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడమూ అయింది. ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్(స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవ

కాశం దొరికింది. ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.

ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

స్ఫూర్తి... విజయం
ఆ స్ఫూర్తితో కొంతమంది స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్)ను స్థాపించాను. దీని వ్యవహారాలు నడుపుతూనే ఆస్ట్రేలియా సమాజంలో ఉన్న రుగ్మతల మీద పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ డ్రగ్స్ బారిన పడే యువత చాలా ఎక్కువ. వాళ్లను గుర్తించి కౌన్సిలింగ్‌లు ఇప్పించడం, పునరావాస కేంద్రాల్లో చేర్పించడం, వాళ్లకు పనులు నేర్పించడం వంటివి చేస్తుంటాను మా సంస్థ తరపున.

అలా మాదకద్రవ్యాల అలవాటు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న కొంతమంది అమ్మాయిలు రకరకాల పనులు నేర్చుకుని చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి అమ్మాయిలనే కొంతమందిని ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్ కార్యక్రమంలో భాగంగా ఇండియాకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేపట్టిన చాలా పనుల్లో విజయాలే సాధించాను. ఇకముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయనే ఆశతోనే ముందడుగు వేస్తున్నాను.'
- సరస్వతి రమ

1 comment:

  1. ఒక తెలుగు వనిత ఎక్కడో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మాదక ద్రవ్యాలు సేవించే యువతులను సక్రమ మార్గములో నడిపించి వారికి పునరావాస ప్రక్రియ చేస్తున్నారంటే ప్రతి తెలుగు వాడు ఆమెను మనసారా అభినందించాలి.

    ReplyDelete