Monday, April 25, 2011

దివ్య మోహన చిత్రరాజం * ' రాజా ' రవివర్మ

"రవివర్మకే అంద ని అందానివో..!'' అన్న ఈ ఒక్క పాదం చాలు,అందాన్ని చిత్రించడంలో 'రాజా' రవివర్మ ఎంతటి అత్యున్నత స్థానంలో ఉన్నాడో చెప్పడానికి . అందమంటే అదేదో కేవలం రూపురేఖలకు సంబంధించినదని కాదు. అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, భారతీయ తాత్వికతను, అన్నింటినీ మించి ఒక దివ్యత్వాన్ని సంతరించుకున్న అందాల్ని అయన చిత్రించాడు. భారతీయ చిత్రకళా కీర్తిని ప్రపంచమంతా విస్తరింపచేశాడు. నేడు ఇంటింటా కనిపించే దేవతా చిత్రపటాల్లో చాలా వరకు రవివర్మ రూపకల్పనలే అంటే ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, ఇది నిజం.  ఆయన జయంతి ఏప్రిల్ - 29.

ముక్కోటిదేవతల్లో ఏ ఒక్కరికీ అప్పటికింకా స్పష్టమైన రూపురేఖల్లేవు. అంతకు ముందే మనసులో ఉన్న రూపాలతో వాటిని అన్వయించుకుని వాటితోనే సర్దుకుపోవలసిన నిస్సహాయ స్థితి. దివ్యకళ లేకపోయినా కనీసం జీవకళ అయినా లేని దేవతా రూపాలనే పూజించుకోవలసిన నిస్సహాయ స్థితి రాజా రవివర్మను అమితంగా వేధించింది. ఈ వెలితి ఇంకా ఇలాగే ఎప్పటికీ కొనసాగడం సముచితం కాదనుకున్నాడు. రామాయణ, మహాభారతాల్లోని రాముడూ, కృష్ణుల పైన మానవాళికి ఇంత ప్రేమా భక్తులు ఉన్నా, వారి రూపాన్ని గురించిన స్పష్టత లేకపోవడం ఆధ్మాత్మికంగా కూడా నష్టమేననుకున్నాడు.

అందుకే ఆ లోటును పూరించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నాడు. కాకపోతే ఒక మనిషి తన జీవిత కాలంలో ముక్కోటి దేవతల చిత్రాలు గీయడం అసాధ్యం కదా! అందుకే దేవతా మూర్తుల్లో కొంత మంది ప్రముఖుల చిత్రాలైనా వేయాలనుకున్నాడు. అంతే! అదే ఆయన జీవిత లక్ష్యమై పోయింది. అప్పటిదాకా భారతీయుల ఊహల్లోనే ఉండిపోయిన దేవతా రూపాలను ఆయన తొలిసారిగా సజీవంగా జీవద్వంతంగా చిత్రించే పనిలో నిమగ్నమైపోయాడు. ఒక తపస్విలా మారిపోయాడు. రవి వర్మ తన చిత్రలేఖనంలో దేవతా మూర్తుల రూపురేఖలకే పరిమితం కాకుండా గొప్ప అందాన్ని, అంతకన్నా మించి ఒక దివ్యత్వాన్ని చిత్రించేవాడు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలతో అమితంగా ప్రభావితమైన వ్యక్తి రవి వర్మ. ఆయన గీసిన ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్వికత తొంగిచూస్తూ ఉంటాయి. నిజానికి రవి వర్మ శిక్షణ పొందింది పాశ్చాత్య చిత్రకళా రీతుల్లోనే.అయినా, ఆ కళానైపుణ్యాలను భారతీయ కళను మెరుగుపరచడానికి, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతలను ఆవిష్కరించడానికే వినియోగించాడు. ఆయన కళా రూపాలు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ పొందడానికి ఈ లక్షణం ఒక ప్రధాన కారణమయ్యింది. నిజానికి కళలు అంటేనే సమైక్యపరిచేవి. అవి భాషకో, ప్రాంతానికో, దేశానికో పరిమితమై ఉండవు.

అవి విశ్వవ్యాప్తమై ఉంటాయి. అందుకే పాశ్చాత్య చిత్రకళా రీతులను భారతీయ చిత్రకళతో మేళవించడంలో అతనికేమీ అభ్యంతరకరంగా అనిపించలేదు. కళలు మానవ అంతరంగాన్ని అవిష్కరించే గొప్ప వేదికలు. అవి విశ్వస్పృహతో పనిచే సినప్పుడే జీవితాలను తేజోవంతం చేస్తాయి. జీవితానికి ఒక కొత్త అర్థాన్ని చెబుతాయి. సత్యాలను లోతుగా అర్థం చేసుకోవడానికే కాకుండా జీవిత విలువలు శాశ్వతంగా నిలబడేందుకు కూడా తోడ్పడతాయి.

దేవతా రూపాల్లో...
భారతీయ కళలు ఎక్కువగా సంకేతాత్మకంగానే ఉంటాయి. రాముడు, కృష్ణులను ఆజాను బాహులుగా చిత్రించడం వారి అపార శక్తిని తెలియ చెప్పడానికే. కొంత మంది దేవతలకు నాలుగు తలలు ఉంచడం వెనుక నాలుగు రెట్లు అధికంగా ఉండే వారి మేధోశక్తికి సంకేతంగా ఉంటాయి. ఇలాంటి విషయాలను పైపైన చూసే వారు వాటిలోని అంతర్మూలాలను గుర్తించలేరు. భారతీయ కళలు స్థూల విషయాలనుంచి సూక్ష్మ విషయాలకు, భౌతిక అంశాలనుంచి అభౌతిక విషయాలకు నడిపించడానికి ప్రాధాన్యం వహిస్తాయి. అలాగే నీడల్లోంచి నిజాల్లోకి వెళతాయి. దేవతా మూర్తుల్లో చాలా వరకు ఇలాంటి సంకేతాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి రవివర్మకు అత్యంత ప్రియంగా ఉండేవి. ఈ కారణంగా రవివర్మ భారతీయ ఇతిహాసాలకు , భారతీయ సంస్కృతీ రీతులకు విశేష ప్రాధాన్యతను ఇచ్చారు.

దివ్యత్వం ప్రధానం

భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత కూడా ఒక ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక దివ్యత్వానికి బీజంగా ఉంటుంది. యోగులు, రుషులకే పరిమితం కాకుండా ఈ దివ్యత్వం కొంతమంది సామాన్యుల్లోనూ కనిపించడం రవివర్మను అమితంగా ఆకర్షించింది . అందుకే ఆయన గీసిన ప్రతీ చిత్రంలోనూ దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. ఆయన తన ప్రతి కళారూపంలోనూ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొదుగుతాడు. కళాత్మకత, తోడుకాకుండా జీవితం పరిపూర్ణం కాదని అతడు బలంగా నమ్ముతాడు.

నిజానికి కళలన్నీ లోకంలోని వెలితిని పూరించడానికే కదా! పరిశీలిస్తే ఈ ప్రపంచంలో అడుగడుగునా అన్నీ పరిమితులు, లోపాలు, నిరాశాజనక అంశాలే కనిపిస్తాయి. ఎక్కువగా మనం ఆశించినదానికి విరుద్ధంగానే ఉంటాయి. అయితే ఈ పరిమితులను తుడిచేసి, లోపాలను తొలగించి ఆశావహ ఆంశాలను నింపగలిగేవి కళలే అంటాడు రవివర్మ. వాస్తవికతో సంబంధం లేకుండా కళ లు మనలోని వెలితిని అవి పూరిస్తాయని, మనసులో పెనవేసుకున్న దుఃఖాన్ని రూపుమాపి మనలో ఆనందాన్ని నింపుతాయని అతడు బలంగా నమ్ముతాడు.

ఈ భావజాలమే అతని పెయింటింగ్స్ ఒక విశిష్ట స్థానాన్ని పొందడానికి దోహదం చేశాయి. రాముడు, కృష్ణుడితో పాటు ఆయన చిత్రించిన శకుంతల, నల, దమయంతులు, చిన్ని కృష్ణుడు-యశోద, లక్ష్మి, సరస్వతి, రాధా-కృష్ణులు, అర్జున-సుభద్ర, గంగను తన శిరస్సు మీదికి ఆహ్వానించే శివుడు ఇలాంటి రవివర్మ చిత్రాలు అపురూప ఖండాలుగా నిలిచాయి.

స్థానిక ప్రభావం
రవివర్మ పేరుకు ముందు 'రాజా' అన్నది అతని పెయింటింగ్స్‌కి పురస్కారంగా బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు. అంతే తప్ప అతనేమీ రాజవంశీకుడు కాదు. కేరళలోని కిలిమనూర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన రవివర్మ పై ఆ ప్రాంత ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆ ప్రాంతపు స్త్రీలే ఆయన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిగా నిలిచారని ప్రతీతి. ఆయనకు 1873లో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన వియానా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌కు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుంచే ఆయన పేరు దశదిశలా వ్యాపించింది.

వీటన్నిటినీ మించి ఆయన గీసిన దేవదేవతలే మానవ హృదయాల్లో నిలిచిపోయారని ఆయన గీయని మిగిలిన వారెవరూ అంతగా నిలబడలేదన్న వ్యాఖ్యలు మనకు అక్కడక్కడా వినపడుతూ ఉంటాయి. అవి నిజమనిపించే ఆధారాలూ కనిపిస్తాయి. దేవతలను నిలబెట్టిన మనిషి అనడం కన్నా మించిన బిరుదు లోకంలో ఇంకేముంటుంది?. అక్టోబర్-2, 1906లో రవివర్మ తన జీవితం చాలించినా భారతీయ చిత్రకళా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయారు.