Saturday, September 25, 2010

దృఢమైన, నీతిమంతమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకులు కావాలి.


ఏరీ నాటి మహా నాయకులు?
"దేశంలో దొంగలు పడ్డారు''- ఇది ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమా టైటిల్. అప్పట్లో ఈ సినిమా టైటిల్ కొంత అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, వామపక్ష, అభ్యుదయ భావజాలం పరిఢవిల్లిన ఆ రోజుల్లో ఈ సినిమాను ప్రజలు బాగానే ఆదరించారు. కానీ, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నెలకొన్న పరిస్థితులను అద్దం పట్టి చూపాలంటే... ఆ సినిమా టైటిల్ కూడా సరిపోయేలా లేదు.

కేవలం మూడు దశాబ్దాల వ్యవధిలో రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ పరిస్థితులు ఇంతగా ఎందుకు దిగజారిపోయాయి? సమస్య కానిది సమస్యగా ఎందుకు మారుతున్నది? అసలైన సమస్యలు, సమస్యలు కాకుండా ఎందుకు పోతున్నాయి? ప్రజల్లో చైతన్యం ఎందుకు కొరవడిం ది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం అన్వేషించవలసిన బాధ్యత పౌర సమాజంపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో మహోన్నత వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞతకు ప్రతీకలైన నేతలు మనకు నాయకత్వం వహించగా, ఇప్పుడు మరుగుజ్జులు మాత్రమే మిగిలారు.

దేశం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసిన నాయకుల తరం అంతరించి, తమ కోసం ప్రజలే త్యాగా లు చేయాలని కోరుకునే నాయకులు మనకు మిగిలారు. ఈ కారణంగానే అప్రధాన విషయాలు ముందుకు రావడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన న్యాయవ్యవస్థ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, మీడియా వ్యవస్థలు అనేకానేక అవలక్షణాలను సంతరించుకుని కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం దేశానికి దిశ-దశ నిర్దేశించగల సమర్థమైన, ఆదర్శవంతమైన నాయకత్వం లేకుండా పోవడమే!

గడచిన వారం రోజులుగా దేశంలో చోటు చేసుకున్న సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే జాతి భవిష్యత్తు పట్ల గుబులే మిగులుతుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై అలహాబాద్ హైకోర్టు ఇవ్వనున్న తీర్పును తలచుకుని ప్రశాంతంగా నిద్రపోలేని స్థితిలో ఈ దేశ ప్రజలు ఉండటానికి కారకు లు ఎవరు? ఆ వివాదంపై జాతి మొత్తం తల్లడిల్లవలసిన అవసరం ఉందా?

తెలియని, కారణంలేని భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజానీకం కాలం గడుపుతున్న సమయంలోనే, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని వచ్చిన వార్తలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారిలో సగం మంది అవినీతిపరులేనని సీనియర్ న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ చేసిన సంచలనాత్మక ప్రకటనతో కలవరం చెందకుం డా ఎలా ఉండగలం! ముందుగా అయోధ్య అంశాన్ని తీసుకుందాం.

అక్కడి వివాదాస్పద భూమిలో రామమందిరం ఉండేదా? బాబ్రీ మసీదు ఉండేదా? అనే వివాదంపై హైకోర్టు తీర్పు శుక్రవారంనాడు వెలువడవలసి ఉంది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ తీర్పు ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇలా ఒక కోర్టు ఇవ్వవలసిన తీర్పును వాయిదా వేయాలని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదు. అయినా, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వు జారీ చేసింది. దీనివల్ల వారం రోజులపాటు ఉపశమనం లభించవచ్చుగానీ, సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించలేదు కదా!

ఈ నెల 28 తర్వాత తీర్పు రావచ్చు. అప్పుడైనా పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. కానీ, ఈ లోపు న్యాయ వ్యవస్థ తానే ఒక తప్పుడు సంప్రదాయానికి తెర తీసింది. ఈ విషయం అలా ఉంచితే ఈ దేశ ప్రజలకు అయోధ్య వివాదం ఒక్కటే సమ స్యా? అసలు ఇది ఒక సమస్య ఎలా అవుతుంది? ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి పరిమితం కావలసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారకులు ఎవరు? దీనిపై దేశ ప్రజలందరూ ఆందోళనతో గడపవలసిన అవసరం ఎందుకు వచ్చింది?

బలమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకత్వం ఉండి ఉంటే... కూటికీ గుడ్డకి ఉపయోగపడని ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకు ని ఉండేవాళ్లం కాదా? ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న మన్మోహన్‌సింగ్ ప్రభు త్వం తాను భయపడుతూ, ప్రజలను భయపెడుతున్నది. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపవలసిన ప్రధాన ప్రతిపక్షం బి.జె.పి. కోర్టు తీర్పు తర్వాత రాజకీయ లబ్ధిపొందే అవకాశాల కోసం వేచి చూస్తున్నది.

బి.జె.పి.కి ఆ అవకాశం ఇవ్వకుండా మైనారిటీలకు తామే రక్షకులమన్న భావన కల్పించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఈ రెండు పార్టీల ఆలోచనల్లో దేశ ప్రజల హితం ఏమైనా ఉందా? నిజానికి వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నా, మసీదు ఉన్నా ఈ దేశ ప్రజలకు వొనగూరే ప్రయోజనం ఏమిటి? దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఎన్నో ఉండగా, మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు అంత ప్రాధాన్యం ఇస్తూ వణికి చస్తూ ఉండాలా?

నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించలేరా? దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వివాద పరిష్కారానికి సహకరించవలసిందిగా ఆయా మతపెద్దలను పాలకులు ఆదేశించలేరా? ఆ దిశగా ఎందుకు ప్రయ త్నం చేయరు! రెండు మతాల వారు కొట్టుకు చస్తే మత పెద్దలు మాత్రం ఎవరికి నాయకత్వం వహించగలరు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అటు నాయకులుగానీ, ఇటు మతపెద్దలు గానీ సామరస్యంతో కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఏ మతమైనా ఆ మతస్తులకు, అన్యులకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు.

ఇక కామన్‌వెల్త్‌గేమ్స్ విషయానికి వస్తే.. క్రీడల నిర్వహణ పేరిట జరిగిన అవినీతి, ప్రపంచ దేశా ల ముందు మన దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, కొందరి అవినీతి కారణంగా దేశ ప్రజలందరూ తలదించుకోవలసిన దుస్థితిని కల్పించింది. ఈ క్రీడల నిర్వహణ అవకాశాన్ని దక్కించుకోవడమే గొప్పగా ప్రచారం చేసుకున్న కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏం సంజాయిషీ ఇవ్వగలదు? సురేశ్ కల్మాడీ నేతృత్వంలోని బృందం అంతులేని అవినీతికి పాల్పడుతున్నదనీ, పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని మీడియా ఘోషించినప్పటికీ నిజాయితీకి చిహ్నంగా భావించుకునే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కనీ సం స్పందించలేదు.

స్వయంగా అవినీతికి పాల్పడకపోయినా, అవినీతిపరులను అడ్డుకోకుండా ప్రోత్సహించడం కూడా అవినీతికి పాల్పడటమే అవుతుంది. ఈ క్రీడల నిర్వహణకోసం 36 వేల కోట్ల రూపాయలను అధికారికంగా కేటాయించారు. వాస్తవానికి ఈ మొత్తం ఆచరణలో ఇంకా పెరిగిందని చెబుతున్నా రు. ఆరోపణలు వచ్చినప్పుడే స్పందించి ఉంటే ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి తప్పి ఉండేది. అవినీతి మామూలే అని ఉపేక్షించితే పరిస్థితులు ఎంతకు దారి తీస్తా యో ఈ ఉదంతం రుజువు చేస్తున్నది.

పాదచారుల కోసం నిర్మించిన వంతెన కూలిపోవడం, ఫాల్స్ సీలింగ్ పడిపోవడం వంటి సంఘటనలు వరుసగా జరగడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో ప్రధాన మంత్రి స్పందించవలసి వచ్చింది. సురేశ్ కల్మాడీ తమ పార్టీకి చెందిన వాడైనందున కాపాడాలన్న ఆలోచనతో తాత్సారం చేయడం వల్ల దేశం పరువేపోయింది. ఇందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ జాతికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం ఉంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న నాయకత్వ లేమి అనే సమస్య ఇక్కడ కూడా పరిస్థితి వికటించడానికి కారణం.

మన్మోహన్‌సింగ్ వ్యక్తిగతంగా నిజాయితీపరుడే. అయితే, ఆయన స్వయం ప్రకాశితుడు కాదు. మరొకరి (సోనియాగాంధీ) నాయకత్వంలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రధాన మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. మన్మోహన్ స్వయం గా నాయకుడైతే స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉండేవారు. అలాంటి పరిస్థితి లేనందున, తన కళ్లముందే అవినీతి ప్రవహిస్తున్నా ఇంతకాలం మౌనంగా ఉండిపోక తప్పలేదు.

బాధ్యతలేని అధికారం చలాయిస్తున్న శ్రీమతి సోనియాగాంధీ అయినా, సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సందేహం రావడం సహజం. కానీ, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే నేటితరానికి చెందిన సాదాసీదా నాయకురాలు కనుక ఆమెకు ఇవన్నీ పట్టించుకునే తీరిక ఉండదు. దేశానికి క్రీడలు అవసరం కావచ్చు. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కించుకోవడం గొప్పే కావ చ్చు.

కానీ, అందుకు తగినట్లుగా వ్యవహరించే స్థితి లేనప్పుడు ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అంతేకాదు, ఇన్ని వేలకోట్ల రూపాయలు వ్యయం చేసి దేశం పరువు తీసుకునే బదులు... దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఎన్నో మౌలిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా! ఉదాహరణకు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మచ్చుకైనా లేవు. ఆడపిల్లల కోసమైనా మరుగుదొడ్లు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

అలాగే, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపచడానికి మరో వెయ్యి కోట్ల రూపాయలు అవసరం. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకోసం ఖర్చు చేసిన డబ్బుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ సౌకర్యాలు కల్పించవచ్చు. కానీ... అలాచేస్తే నాయకులకు కమీషన్లు రావు, పాలకులకు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు పెరగదు. అందుకే, ఈ సమస్యలు ఎప్పటికీ సమస్యలుగానే ఉంటాయి.

ఇక, న్యాయ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పెడధోరణులు అన్నింటినీ మించి కలవరం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు న్యాయమూర్తుల గురించి మాట్లాడాలంటే వణికిపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు న్యాయమూర్తుల నిబద్ధతను ప్రశ్నిస్తున్నారు. నిన్నగాక మొన్న మన రాష్ట్ర హై కోర్టులోనే కేసు లు వింటున్న న్యాయమూర్తులను న్యాయవాదులు దూషించా రు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారిలో సగం మంది అవినీతిపరులేనని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ సంచలనాత్మక ప్రకటన చేశారు.

ఈ ప్రకటన చేసినందుకు ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదు కావచ్చు. కానీ, అంతకంటే ముందు తేలవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ వ్యాఖ్యానించినట్లు "ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు. శాంతి భూషణ్ ప్రకటన చేసిన తర్వాత న్యాయవ్యవస్థ లేదా న్యాయమూర్తులు మౌనంగా ఎందుకు ఉన్నారు?''అన్నది తేలవలసి ఉంది.

దేశంలో ఎమర్జెన్సీ విధిం చి, అపఖ్యాతి మూటగట్టుకుని, అధికారం కోల్పోయిన శ్రీమతి ఇందిరాగాంధీ, తర్వాత జరిగిన ఎన్నికలలో తిరిగి అధికారం కైవసం చేసుకోవడాన్ని అభినందిస్తూ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.ఎన్.భగవతి ఆమెకు లేఖ రాయడం ఆ రోజు ల్లో తీవ్ర వివాదాస్పదం అయింది. తర్వాత రోజుల్లో భగవతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యారు. కానీ, న్యాయవ్యవస్థ ప్రమాణాలకు భంగకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉండేది.

ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. దేశంలో ఎక్కడో ఒకచోట తరచుగా న్యాయమూర్తులు ఆత్మరక్షణలో పడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటో ఆయా న్యాయమూర్తులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేని అధికారాన్ని సంక్రమింప చేసుకుని దేశ ప్రయోజనాల పేరిట సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరైనా ఎవరినైనా విమర్శించకుండా ఎందుకు ఉంటా రు! ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటి వ్ బాటలోనే న్యాయవ్యవస్థ కూడా పతనం దిశగా పయనిస్తున్నదని భావించక తప్పదు.

మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి ది. ఒకప్పుడు దేశం కోసం పత్రికలు నిర్వహించేవారు. తర్వాత రోజులలో కొంత వ్యాపార దృక్పథం జొరబడినప్పటికీ, ప్రజల ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో పత్రికలు వ్యవహరి స్తూ వచ్చాయి. కానీ, ఇటీవల కాలంలో పరోక్ష ప్రయోజనాల కోసం ఎవరు పడితే వారు మీడియాలోకి ప్రవేశించారు. ప్రస్తు తం ఆ దశ కూడా పోయి, రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, పార్టీ లు తమ స్వంత పత్రికలు - చానళ్లు ప్రారంభించడం ఫ్యాషన్ గా మారిపోయింది.

ఫలితంగా నిబద్ధతతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్న పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నది. పర్యవసానంగా ప్రజలకోసం నిలబడవలసిన పత్రికలు అంతర్థానమై, పార్టీల కోసం ప్రచారం చేసే పత్రికలే మిగిలే ప్రమా దం పొంచి ఉంది. తన అధికారాన్ని కాపాడుకోవడానికి శ్రీమ తి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అంతులేని చైతన్యంతో స్పందించిన పౌర సమాజం, ఇప్పుడు నిస్తేజంగా పడి ఉంది. ఆనాడు ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండకపోతే జైల్లో గడపవలసి ఉంటుందని తెలిసినా లెక్క చేయకుండా ఆయా నాయకులు ఉద్యమించారు.

ఫలితంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లతో దేశంలోని జైళ్లు అన్నీ నిండిపోయాయి. మరి ఇప్పుడు.. ఎమర్జెన్సీ లేదు. పోరాటం చేస్తే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు లేవు. కానీ, కూలిపోతున్న వ్యవస్థలను కాపాడుకోవడానికై పోరాటాలు చేసేవారే కరువయ్యారు. ఈ పరిస్థితులో మార్పు రావాలంటే దృఢమైన, నీతిమంతమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకులు కావాలి. ప్రస్తుతానికి అటువంటి నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాబట్టి, వేచి చూద్దాం! 

-ఆదిత్య