Thursday, May 19, 2011

మెరుపు తగ్గినందుకే '' ఎరుపు '' ఓటమి

 http://www.currentnewsindia.com/wp-content/uploads/2011/04/cpm-logo_1.jpg
బెంగాల్ అంటే భారతదేశపు తూర్పువాకిలి మాత్రమే కాదు మార్పువాకిలి కూడా. ఇంగ్లీషువాడు అడుగుపెట్టి తొలిరాజ్యం స్థాపించుకున్నది ఇక్కడే. సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలిచే పడమటిగాడ్పు సుడులు తిరిగింది ఇక్కడే. రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్రవిద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి,హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జగదీశ్‌చంద్రబోసు, సత్యజిత్‌రే, అమర్త్యసేన్.. చెప్పుకుంటూ పోతే జాతి గర్వించదగ్గ మేధావులు ప్రతిభావంతులు ధీరులు వీరులు వందల వేల సంఖ్యలో కనిపిస్తారు. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో దేశం రేపు అదే ఆలోచిస్తుందట. బెంగాల్ ఆకాశం ఎరుపెక్కినప్పుడు, ప్రపంచం దానివైపు ఆసక్తిగా చూసింది. జనం రైటర్స్ బిల్డింగ్ గర్భగుడిలో ఎర్రదేవుడిని ప్రతిష్ఠించినప్పుడు దేశమంతటా ఆ జైత్రయాత్ర కొనసాగుతుందనిపించింది. http://westbengalelections2011.com/wp-content/uploads/2011/02/Election-in-West-Bengal-Assembly-Election-in-West-Bengal.jpg
చిట్టగాంగ్ వీరుల దగ్గరనుంచి చారుమజుందార్ దాకా బెంగాల్ ప్రజావిప్లవాలకు వేదికగానే ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన తెభాగా రైతాంగ ఉద్యమం కానీ, స్వాతంత్య్రానంతరం రెండుసార్లు చెలరేగిన ఆహారభద్రతా ఉద్యమాలు కానీ బెంగాలీ ప్రజానీకాన్ని సమరశీలంగా మలిచాయి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి, చీలిక తరువాత అతివాద పక్షంగా ఉండిన మార్క్సిస్టు పార్టీకి, మరో చీలిక అనంతరం నక్సలైట్ పార్టీలకు బెంగాల్ వేదిక అయింది.

1967 నుంచే అధికారంలో భాగస్వామ్యం సాధించుకోగలిగిన మార్క్సిస్టు పార్టీ, ఎమర్జెన్సీ చీకటిరోజుల అనంతరం, 1977లో సహవామపక్షాలతో కలసి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచే స్థాయికి ఎదిగింది. అధికారంలోకి రాగానే భూసంస్కరణల అమలును చేపట్టింది. మిగులు భూములను పంచడం, కౌలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యాలుగా తొలిదఫా జ్యోతిబసు ప్రభుత్వం పనిచేసింది. ఫలితంగా, రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదులు వేయగలిగింది. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగంపై పార్టీ పట్టును స్థాపించగలిగింది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhh1M-BnJftw-88Zqk9oWhosluz0E6IZ18on2kzimfupSpXTALMrefVExaN0Hf9llcio1sEqNHA3nhWAKBmwGe1LPJmTyXB6ncHDC4_10CZa3WSAshxaK4XnthPZvHbV3RGdvwfhTVHI1R0/s1600/Buddha+WB.JPG
రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో బలంగా ఉండిన ట్రేడ్‌యూనియన్ ఉద్యమం, కిసాన్ ఉద్యమం వామపక్ష ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేందుకు బాటలు వేశాయి.వామపక్ష ప్రభుత్వం హయాంలో సంక్షేమపథకాలు, పేదలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు కొన్ని సాధ్యపడ్డాయి కానీ, పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంగుళం ముందుకు సాగలేదు. ప్రతిపక్ష ప్రభుత్వమని చెప్పి కేంద్రం ప్రభుత్వరంగ పరిశ్రమలకు అవకాశం ఇవ్వలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమని, అల్లరిపెట్టే ట్రేడ్‌యూనియన్ల రాష్ట్రమని ప్రైవేటు రంగమూ ప్రవేశించలేదు. http://images.jagran.com/cpm-b-11-4-2011.jpg
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎత్తుగడగా మాత్రమే ఎన్నికలను, ప్రభుత్వ నిర్వహణను ఆశ్రయిస్తున్నామని చెప్పిన మార్క్సిస్టు పార్టీకి రాష్ట్రాభివృద్ధికి అనువైన మార్గమేదో బోధపడలేదు. బెంగాల్ అంటే భారతదేశంలో ఒక మారుమూల రాష్ట్రం, పరిశ్రమలు బతకలేని రాష్ట్రం- అన్న ముద్ర ఖాయపడింది. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగులకు, భృతి ఇవ్వడం సంక్షేమచర్యే అయింది తప్ప, పరిష్కారం కాలేకపోయింది. http://static.ibnlive.com/pix/sitepix/10_2010/prakash-karat2710630_271x181.jpg
వరుస విజయాలతో అధికారానికి అలవాటుపడిపోయిన పార్టీ యంత్రాంగంలో అనేక అవలక్షణాలు ప్రవేశించాయి, ఉద్యమశీలత కొరవడింది. జ్యోతిబసుతో సహా పార్టీ, ప్రభుత్వ అధినేతలందరూ వ్యక్తిగత నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతీకలుగా ఉండినప్పటికీ, దిగువస్థాయిల్లో పార్టీనాయకుల తీరు భిన్నంగా ఉండింది.

బెంగాల్‌తో సంబంధం లేకుండా మార్క్సిస్టు పార్టీ సరళిలో కూడా మార్పులు రాసాగాయి. కొత్తరకం రాజీకమ్యూనిస్టులే తప్ప కడదాకా నిలిచే విప్లవ కమ్యూనిస్టులు కాదని నక్సలైట్లు 1960లలోనే విమర్శించినప్పటికీ, ఎమర్జెన్సీ ముగిసేదాకా మార్క్సిస్టు పార్టీకి మిలిటెంట్ పార్టీ ప్రతిష్ఠే ఉండేది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర అణచివేతచర్యలకు లక్ష్యంగా ఉన్నవారిలో, అజ్ఞాతజీవితం గడపవలసివచ్చినవారిలో మార్క్సిస్టులు కూడా ఉన్నారు.

ఆ తరువాత కొంతకాలం దాకా సిపిఎం మాటల్లో విప్లవం, తగిన సమయంలో సాయుధపోరాటం వంటి మాటలు వినిపిస్తూనే ఉండేవి. మరోవైపు ఇందిరాగాంధీతో అంటకాగి అప్రతిష్ఠపాలైన సిపిఐతో పోల్చినప్పుడు, మార్క్సిస్టుపార్టీ నికార్సయిన పార్టీగానే కనిపించేది. బెంగాల్ విజయంతో స్ఫూర్తిపొందిన ఆపార్టీ 1980ల తరువాత ప్రధానస్రవంతి రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్ష ప్రత్యామ్నాయాలను నిర్మించడంలోను, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలతో పొత్తుపెట్టుకోవడంలోను ఆసక్తిపెరిగిపోయింది.

అదే సమయంలో తనకు అనుబంధంగా ఉన్న రైతాంగ, కార్మిక, ఉద్యోగ సంఘాల ద్వారా పోరాటాలను కూడా పార్టీ నిర్వహించేది. అయితే, పాలకపార్టీలతో పొత్తుల క్రీడ కారణంగా అప్పుడప్పుడు నాలుగుసీట్లు అదనంగా గెలుచుకోగలిగినా, మరోసారి అవే ప్రధానపార్టీలు చతికిలపడినప్పుడు వామపక్షాల సభాబలం కూడా తగ్గిపోయేది. పోరాటాల ద్వారా ఏర్పడే ప్రజాబలం మాత్రమే వారికి స్థిరంగా ఉంటూ వచ్చింది.

ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సిపిఎం, ఎన్నికల రాజకీయాలపైనే మొగ్గు చూపుతూ వచ్చింది. ప్రధాన పాలక పార్టీల ఘర్షణలో ముందుకు వచ్చిన దేశసమగ్రత, సమైక్యత, సుస్థిరత, లౌకికవాదం, తీవ్రవాదంపై పోరాటం- వంటి నినాదాల చుట్టూ పరిభ్రమించింది. శ్రామికవర్గపార్టీగా ఉండిన సంస్థ భావరంగంలో ఎగువ మధ్యతరగతికి, ఆర్థికవిధానాల్లో పారిశ్రామికులకు ఆమోదకరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

1990దశకం ప్రారంభంలో అమలులోకి వచ్చిన ఆర్థికసంస్కరణలు వామపక్షాలకు కొత్త పోరాట అవకాశాలను తెరిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త పారిశ్రామికవిధానం వల్ల కార్మికులకు ఏర్పడిన అభద్రత కమ్యూనిస్టులకు నూతన పోరాట ఎజెండాను కల్పించాయి.

అయితే, ఆ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో వామపక్షాలు విఫలమయ్యాయి. సంస్కరణల తొలి దశాబ్దంలో వామపక్షాలు చేసిన ఉద్యమాలన్నీ సారాంశంలో- ప్రభుత్వం తాను తలపెట్టిన సంస్కరణలను కొద్దిపాటి సవరణలతో అమలుచేయించడానికి పనికివచ్చాయి. చివరకు ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగసంఘాలు బలహీనపడ్డాయి. మార్క్సిస్టు పార్టీ నేతలే సంస్కరణల్లోని మంచిని కూడా చూడాలనే వాదన ప్రారంభించారు.
http://img2.allvoices.com/thumbs/event/609/480/53688836-buddhadeb-bhattacharjee.jpg
బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్‌లో సంస్కరణలకు ప్రతినిధిగా చూస్తున్నాము కానీ, 1990లలో జ్యోతిబసు రాష్ట్రానికి ప్రయోజనం కలిగినట్టయితే విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఇక బుద్ధదేవ్ హయాంలో అయితే, మార్పు స్పష్టంగా కనిపించింది. 2006లో ఆయన ఘనవిజయం సాధించినప్పుడు మొదటగా అభినందించింది రతన్‌టాటాయే.

ఉద్యోగాలు దొరుకుతున్నప్పుడు విదేశీపెట్టుబడి మీద ఏమిటి మీ అభ్యంతరం?- అని బుద్ధదేవ్ కేరళలోని తన సహచరుడు అచ్యుతానందన్‌ను ఒక సందర్భంలో ప్రశ్నించారు. బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ మాట్లాడుతున్న మాటలకు, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరించిన వైఖరికి పొంతన లేక పార్టీ అభిమానులు గందరగోళపడ్డారు. తన విధానంలోని ద్వంద్వ స్వభావానికి పార్టీ తగిన వివరణ ఇవ్వలేకపోయింది.

భూములను పంచి, కౌలురైతాంగానికి హక్కులు ఇచ్చి, రైతు అనుకూల చర్యలు చేపట్టిన ప్రభుత్వం పరిశ్రమల కోసం నందిగ్రామ్‌లో, సింగూర్‌లో రైతుల భూములను ఇవ్వడం బెంగాల్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీర్ఘకాలంగా బెంగాల్‌లో పార్టీరాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగడుతున్న తృణమూల్ కాంగ్రెస్‌కు, నలభైయేండ్ల కిందట విఫలమైన ప్రయత్నాన్ని మరోసారి చేపట్టిన మావోయిస్టులకు క్రమంగా రాష్ట్రంలో ఆదరణ పెరిగింది.
http://get.cfn.netdna-cdn.com/wp-content/uploads/2010/06/Mamta-Trinamool-Congress.jpg
ఒకనాడు బెంగాల్‌లో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులను పంజాబ్ పోలీసులు అపహరించి ఎన్‌కౌంటర్ చేస్తే అభ్యంతరం చెప్పిన వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా కేంద్రబలగాలతో కలసి ప్రజలపై అణచివేతచర్యలను నిర్వహించడం, బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం రాష్ట్రంలో దిగజారిన విలువలకు సాక్ష్యంగా నిలిచాయి.

మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం చాలా కాలం పాటు కట్టుబడిన విలువలను కూడా చివరి సంవత్సరాలలో వదులుకున్నది. అందుకే, నందిగ్రామ్, సింగూర్ తరువాత జరిగిన అన్ని స్థాయిల ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ పరాజయాన్ని చవిచూస్తూ వచ్చింది. సిపిఎంనేతలు అంటున్నట్టు బెంగాలీలు కోరుకున్నది కేవలం పార్టీల మార్పు, నేతల మార్పు కాదు. విధానాల మార్పు.

బెంగాల్, కేరళల్లో పరాజయం మార్క్సిస్టు పార్టీకి ఒకరకంగా మేలుచేస్తుంది. తన విధానాలను సమీక్షించుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ శషభిషలు లేకుండా దేశంలో అమలవుతున్న అభివృద్ధి విధానాన్ని సమర్థించడమా, నానాటికి పెరుగుతున్న ప్రజాచైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడమా వారు నింపాదిగా, ఏ పరిమితులూ లేకుండా చర్చించుకోవచ్చు. 2000 సంవత్సరం తరువాత నాలుగేళ్ల పాటు మన రాష్ట్రంలో మార్క్సిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలను గుర్తు తెచ్చుకుంటే, దాని శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేము.

ఆ ప్రయాస అంతా రాజశేఖరరెడ్డి విజయానికి తోడ్పడిందనుకోండి, అది వేరే విషయం. విప్లవకరమైన, మిలిటెంట్ పార్టీగా మార్క్సిస్టు పార్టీ ఉండాలని ఇప్పుడు ఎవరూ ఆశించడంలేదు. నికార్సయిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో చేయగలదు. భారత రాజకీయచిత్రపటంలో ఒక కట్టుబాటున్న ప్రజాస్వామిక రాజకీయ పక్షం అవసరం స్పష్టంగానే కనిపిస్తున్నది. మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా సాగాలని కోరుకోవాలి.

మార్క్సిస్టుపార్టీ స్వయంకృతాపరాధాల కారణంగా ఓడిపోయిందని గ్రహించడం అవసరమే కానీ, అందుకు ఆనందించడం కానీ, సంబరపడడం కానీ అనవసరం.మార్క్సిస్టులు బలహీనపడితే, ప్రధానస్రవంతి రాజకీయాల్లో ప్రజానుకూలమైన గొంతు కనీసంగాకూడా, అప్పుడప్పుడైనా వినిపించే అవకాశం ఉండదు. అలాగే, మమతాబెనర్జీ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. రెండు ఊర్లలో భూమిని అన్యాక్రాంతం చేసినందుకే ప్రభుత్వంపై ఆగ్రహించిన బెంగాలీలు, మొత్తం రాష్ట్రాన్ని అంగట్లో పెట్టగలిగే విధానాలున్న మమతను ఎంతో కాలం సహించరు.
http://economictimes.indiatimes.com/photo/8289643.cms
-కె. శ్రీనివాస్

No comments:

Post a Comment