Wednesday, February 16, 2011

పేదింటి పెద్ద '' జ్యోతి ''

కొందరు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటారు.
జ్యోతి తన జీవితానికే తానే చేతులు అడ్డం పెట్టుకుని దాని వెలుతురు ఆరిపోకుండా చూసుకోగలిగింది.
కొందరు ఎవరైనా తమకు ఉద్యోగం ఇస్తే బాగుండు అనుకుంటారు.
జ్యోతి నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వరు అని పోరాడుతుంది.
కొందరు అమెరికాను చూసొస్తే చాలు అనుకుంటారు.
జ్యోతి నేనెందుకు అమెరికాలో స్థిరపడకూడదు అని భుజాలకు రెక్కలు కట్టుకుంటుంది.
జ్యోతి కథ ఒక సినిమా కథకు తక్కువకాని కథ. సినిమా తీయదగ్గ కథ.
ఫిక్షన్ కంటే అరుదుగా ఉండే జీవితంలాంటి కథ.
ఆమె కథ చాలామందికి దీపంలాంటిది. దారిలాంటిది. జీవనజ్యోతిలాంటిది.


‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే సూత్రాన్ని గట్టిగా విశ్వసించారు అనిల్‌జ్యోతి. వరంగల్ జిల్లా నర్సింహులుగూడెంలోని ఒక సాధారణ కుటుంబంలోని ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన జ్యోతి ప్రస్తుతం అమెరికాలో ఏటా నాలుగు మిలియన్ డాలర్ల టర్నోవరున్న ‘కీ’ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు అధినేత. అంతేకాదు, ‘నేర్చుకోవడానికే జీవించు’(లెర్న్ టు లివ్) అనే నినాదంతో వృద్ధ, అనాథల ఆశ్రమాలకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అనిల్‌జ్యోతి తన జీవన పోరాటంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ స్ఫూర్తిని కలిగించేవే.

తల్లి ‘లేని’ పిల్లగా హాస్టల్‌లో...
జ్యోతి తండ్రి వెంకటరెడ్డి టీచర్. ఎమర్జెన్సీలో ఉద్యోగం పోవడంతో పిల్లల చదువులు, వారి పోషణ ఆయనకు భారమయ్యాయి. దాంతో జ్యోతిని ఏదైనా హాస్టల్‌లో వేయాలనుకున్నారు. హన్మకొండలోని ‘బాలసదనం’లో అవకాశముందని తెలిసి అక్కడికి వెళ్లారు. అయితే సదన్ నిర్వాహకులు తల్లిదండ్రులు లేని పిల్లలనే చేర్చుకుంటామనడంతో అప్పటికే ఆర్థికబాధలతో విసుగెత్తిపోయిన తండ్రి ‘అమ్మలేని పిల్ల’ అని చెప్పి జ్యోతిని హాస్టల్‌లో చేర్పించారు. అమ్మ బతికే ఉన్నా అమ్మ లేని అనాథలా హాస్టల్‌లో చేరిన ఘట్టం జ్యోతిని చాలారోజులు బాధించింది. ఆ మాటకొస్తే ఆ బాధ ఇప్పటికీ పోలేదు.

హాస్టల్‌లో ఉన్న జ్యోతిని చూడటానికి అమ్మ వచ్చే అవకాశం లేదు. అప్పుడప్పుడూ వచ్చే నాన్నలోనే అమ్మ సరస్వతమ్మను చూసుకునేది. హాస్టల్‌లో ఉన్న పిల్లలను చూసేందుకు వాళ్ల తల్లులు వచ్చినప్పుడు జ్యోతి హృదయం విలవిల్లాడేది. ఆ బాధను మర్చిపోవడానికి స్నేహితులతో ఎక్కువకాలం గడిపేది. నాన్న ఇచ్చిన గాంధీ, నెహ్రూ, షేక్‌స్పియర్ బయోగ్రఫీలను చదవడం అలవరచుకుంది.

టీచరు ఉద్యోగం కోసం...
వేసవి సెలవుల్లో సదన్ సూపరింటెండెంట్ వాళ్లతోనే ఉంటూ టైపింగ్‌ను నేర్చుకుంది జ్యోతి. అక్కడ టెన్త్ పూర్తయిన తర్వాత టీచరు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఒకేషనల్‌కోర్సులో చేరితే అది పూర్తయిన తర్వాత కాని తెలియలేదు జ్యోతికి... ఆ కోర్సుతో టీచర్ ఉద్యోగం రాదని! జ్యోతి హతాశురాలయ్యింది. చదువుకుంటానని మొత్తుకుంది. కాని ఇంట్లో వినకుండా పెళ్లి చేసేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్తగారి కుటుంబం జ్యోతి కుటుంబానికి దగ్గరి బంధువులే అయినా అప్పటిదాకా పెరిగిన హాస్టల్ జీవితానికి పూర్తిగా భిన్నంగా అనిపించిందామెకు. వ్యవసాయ కుటుంబం కావడంతో పనులు చేయడానికి పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని చేస్తున్నా సరే ఏదో వెలితి ఆమెను వెన్నాడటం మానలేదు. అప్పుడే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ రావడంతో అతికష్టం మీద జ్యోతి అందులో చేరింది. ఉద్యోగరీత్యా జిల్లా అంతా తిరగాల్సి వచ్చేది. దాంతో వరంగల్‌కు మకాం మార్చి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. ఎలాగో టైలరింగ్ నేర్చుకుని లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. అప్పుడే టైపింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. అప్పుడు వచ్చిన ఓ ఆలోచన ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
చదువే కీలకం...
ఏ జీవితమైనా బాగుపడాలంటే చదువు ముఖ్యం. తనకు చదువు పెద్దగా లేదు. అందుకే ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది జ్యోతి. కష్టపడి ఫీజు డబ్బులు సమకూర్చుకుని ఓపెన్‌యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. అదే సమయంలో పరిచయస్తులు కొందరు లైబ్రరీ పెట్టుకోమని సలహా ఇచ్చారు. లైబ్రరీలోనే టైపింగ్, టైలరింగ్ కూడా. వొకేషనల్ కోర్సుతో పాటు డిగ్రీ ఉండేసరికి టీచరు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్పెషల్ టీచరుగా అవకాశం వచ్చింది. భర్తకు సిటిజన్ క్లబ్‌లో ఉద్యోగం రావడంతో జీవితం ఓ గాడిన పడింది. ఉద్యోగం రెగ్యులర్ కావడంతో జీతం పెరిగింది. జీతం వస్తోంది కదా అని ఊరుకోకుండా జ్యోతి అక్కడ కూడా తన వైవిధ్యాన్ని, పోరాట పటిమను నిరూపించుకున్నారు. తాను పనిచేసే స్కూల్లో నాలుగో తరగతి వరకు ఉంటే ఏడోతరగతి వరకు ఏర్పాటు చేయించి స్వంత భవనాలను కూడా సాధించారు. ఆ సమయంలోనే ఎం.ఏ సోషియాలజీ వన్‌సిట్టింగ్‌లో పాసయ్యారు. టీచర్ ఉద్యోగం నుంచి పదోన్నతి పొంది మండల్ చైల్డ్ ఆఫీసరయ్యారు. అయితే అక్కడితో ఆగిపోలేదు!
అమెరికా వైపు...
బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్లాలనుకున్నారు జ్యోతి. దానికి ఉన్న మార్గాలను తెలుసుకున్నారు. ఒక బంధువుకు సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ ఉండడంతో కంప్యూటర్‌కోర్సు నేర్చుకుని వీసా కోసం ప్రయత్నిస్తే తెలుగు మీడియమనే కారణంతో వీసా రాలేదు. హెచ్-1తోనే కాకుండా విజిటర్స్ వీసాపై కూడా అమెరికాకు వెళ్లొచ్చని తెలియడంతో ఆ దిశగా ప్రయత్నించి ఎంతో ఆశతో అమెరికా వెళితే విజిటర్స్ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమతించవని తెలిసి చావుదెబ్బ తినాల్సి వచ్చింది. అయితే భారతీయుల దుకాణాల్లో పనిచేసే అవకాశం మాత్రం ఉండటంతో మూవీ క్యాసెట్‌షాపులో సేల్స్‌గర్ల్ ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత తమ ఊరివాళ్ల సహకారంతో ఓ సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీలో ఉద్యోగం సాధించింది. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న టైపింగ్ ఇందుకు ఉపయోగపడింది. ఆ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆఫ్ అమెరికా కంపెనీలో రిక్రూటర్‌గా ఉద్యోగం దొరికింది.

ఆ కంపెనీ వారి సహకారంతోటే ముందుగా వీసా ఎక్స్‌టెన్షన్, ఆ తర్వాత హెచ్‌వన్ వీసా సాధించింది. వర్జీనియాలో ఏడాదికి అరవై వేల డాలర్ల ప్యాకేజితో ఉద్యోగం వచ్చింది. దాంతో అమెరికాలో ఆమె సెటిల్ కాగలిగింది. ఎలాగైనా సరే అమెరికాలో బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్న జ్యోతి ఓ పార్ట్‌నర్‌ని చేర్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించింది. కొన్నాళ్లకు ఆమె శ్రమ ఫలించి వ్యాపారంలో లాభాలు కళ్లజూసింది. జీవితంలో ఒక్కసారైనా అమెరికాను చూసిరావాలని కలలుకనే సగటు భారతీయులుగానే ఆలోచిస్తే ఆమె జ్యోతి ఎందుకవుతుంది? అమెరికాలో సంపాదించిన ఆస్తులు, వాటి సముపార్జనలో ఎదురైనఅనుభవంతో గ్రామీణ భారతంలోని ‘మహిళా సాధికారత, స్వావలంబన’ కోసం ‘లెర్న్ టు లివ్’ ఫౌండేషన్ ద్వారా పనిచేయాలని నిర్ణయించుకుంది.

‘‘మహిళ సంపాదనపరురాలైతే భర్త, పిల్లలు, బంధువులు, సమాజం అంతా గౌరవిస్తుంది. ఆ కుటుంబ కొనుగోలుశక్తి, ఆర్థిక, సామాజిక స్థితి అంతా పెరుగుతుంది. అన్ని కుటుంబాలు ఇలాగే ఉంటే బంధువర్గం, సమాజం, దేశం అంతా అభివృద్ధి చెందుతారు’’ అని చెబుతున్న జ్యోతి జీవితంలోని చివరిమజిలీ దాకా నేర్చుకుంటూనే ఉంటానని ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ ఉత్సాహం ప్రతి మహిళకూ ఆదర్శం కావాలి.

ఆడపిల్ల పరాన్నజీవి కాదు
ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన జీవితాంతం తండ్రి, భర్త, పిల్లలు ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉండాలా? లింగ భేదానికి అతీతంగా ప్రతివారు పనిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదు. అలాగని కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాల్లేకుండా ఉండాలనేది నా అభిమతం కాదు. పని సంస్కృతికి ప్రతి గ్రామీణ మహిళా అలవాటు పడాలి. ఇందుకోసం గ్రామీణప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, శిక్షణ, ఉపాధి వంటి వాటికోసం నా శక్తిని, అనుభవాన్ని ఉపయోగించాలని ఉంది.
 
- అనిల్‌జ్యోతి
http://www.facebook.com/video/video.php?v=10150221623072386&comments

3 comments:

  1. superb.Aadadi abala kadu sabala ni prove chesharu.Hats off sister.

    ReplyDelete
  2. am speechless .. a role model for every women, and men also..

    ReplyDelete