Thursday, December 23, 2010

ఇంతింతై... అవధానమంతై

చెప్పు, చేట, పేడ, గాడిద...ఈ నాలుగు పదాలతో శ్రీకృష్ణదేవరాయలు అల్లసానికి చేసిన సత్కారాన్ని వర్ణించండి? పోనీ...సచిన్, ద్రవిడ్, గంగూలీ, గంభీర్‌లు ఉండేలా మహాభారత పద్యాన్ని చెప్పగలరా? ఏంటండీ అలా కళ్లెర్ర చేస్తున్నారు?

'మరి..ఈ వేళాకోళాలేంటి? చెప్పేమిటి, చేటేమిటి? వాటితో పెద్దనామాత్యునికి సత్కారమేమిటి? పైగా సచిన్, ద్రవిడ్, గంగూలీ, గంభీర్లతో మహాభారతమా? మా భాషా పరిజ్ఞానానికి పరీక్షా?' అంటున్నారా? అయ్యో..అపార్థం చేసుకున్నారు. ఈ పదాలనే నాగశాంతి స్వరూప, అపర్ణలకు ఇస్తే చిటికెలో చక్కటి పద్యాలు చెప్పేస్తారు ఆశువుగా. అష్టావధానంలో. ఎక్కడ అంటారా? ఆ వివరాలు చెప్పడానికే ఈ కథనం.


పరిచయం: అపర్ణ, పుల్లాభట్ల నాగశాంతి స్వరూప ఇద్దరూ రాజమండ్రిలోని ఆంధ్రయువతీ సంస్కృతకళాశాలలో భాషా ప్రవీణ కోర్సు అభ్యసించారు. వారిలో స్వరూప కంటే అపర్ణ సీనియర్. ఇద్దరూ తెలుగు పండిట్ కోర్సు మూడో సంవత్సరంలో ఉన్నప్పటి నుంచే అష్టావధానం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం స్వరూప తిరుపతిలో ఎమ్ఏ చదువుతోంది. ఈ మధ్యే అపర్ణ గృహిణిగా మారింది.

సరదాగా మొదలుపెట్టాం- నాగశాంతి స్వరూప

నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తెలుగులో అష్టావధానం అనే పాఠముండేది మాకు. మాస్టారు ఆ పాఠాన్ని వివరించి చెప్పాక 'అమ్మో ఎంత కష్టం' అనిపించింది. అయినా కుతూహలం కలిగింది. అట్లా మొదలైన ఇష్టం, జిజ్ఞాసకు మా మాస్టారు ధూళిపాళ మహదేవమణిగారు ఓ రూపాన్నిచ్చారు. నిజానికి మాదేమీ పాండిత్య నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నాన్న సుబ్రహ్మణ్య శర్మ పౌరోహిత్యం చేస్తుంటారు. అమ్మ లక్ష్మీనరసింహాంబ గృహిణి.

ఎవరికీ కనీసం ఈ ప్రక్రియ మీద అవగాహన లేదు. భాషా ప్రవీణ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే మహదేవమణిగారు రకరకాల సందర్భాలు..అంశాలు ఇస్తూ ఆశువుగా పద్యాలు రాయమనేవారు. అలా పద్యాలు రాయడం చాలా ఇష్టంగా..సరదాగా ఉండేది నాకు. నా ఉత్సాహం చూసే లక్ష్మీకామేశ్వరి అనే అమ్మాయితో పాటు నన్నూ ఎంపికచేశారు అష్టావధానం నేర్పడానికి. మా కన్నా ముందు బ్యాచ్‌లో అపర్ణ, ఉదయచంద్రికలు ఎంపికయ్యారు. ఆ కళాశాలలోనే కాదు రాష్ట్రంలో అష్టావధానం చేస్తున్న మహిళలం కూడా మేం నలుగురమే.

పదకొండు అవధానాలయ్యాయి...

రాజమండ్రిలో ఉన్నప్పుడు గణపతి నవరాత్రులలో మా కళాశాలే వేదికగా, ఉపాధ్యాయులే పృచ్ఛకులు(సమస్యలిచ్చేవాళ్లు)గా మహదేవమణిగారి ఆధ్వర్యంలో మా మొదటి అష్టావధానం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా లక్ష్మీకామేశ్వరి, అపర్ణలతో కలిసి పదకొండు అష్టావధానాలు చేశాను. నిషిద్ధాక్షరి, దత్తపదులు, అప్రస్తుత ప్రసంగం ఇలా ఏ అంశమైనా బెరుకు, తత్తరపాటు లేకుండా పూర్తిచేయగలను.

ఇప్పటిదాకా నేను చేసిన అవధానాల్లో నాకు బాగా నచ్చినవి, పేరు తెచ్చినవి రెండు. ఒకటి కిందటేడు కావలిలో చేసిన అవధానం. ఇందులో పృచ్ఛకులంతా మహిళలే. తర్వాతది హైదరాబాదులో...త్యాగరాయ భాషోత్సవాల్లో నేను, కామేశ్వరి కలిసి చేసిన అష్టావధానం. ఆ రోజు మమ్మల్ని సినారె అభినందించారు కూడా. అందులో ఓ పృచ్ఛకుడు 'రాముని మానసంబు కడు రంజిల్లు అప్సర గాంచినంతన్' అనే సమస్యనిచ్చారు పూరించమని. రాముడేంటి? పరకాంతను చూసి ఆనందపడ్డమేంటి అనిపించింది. ఎలా పూరించాలి? అని ఆలోచించి..

కోమలి ఓరచూపులును కుల్కులు లాస్యవినోదహాసముల్
మామన దేవునిన్ కొలుచు సత్యధనంబున చేరబోవు సుత్
రాముడు పంపు మేనకనురాగము నుండెను కౌసుకుండు ఔ
'రా ముని మానసంబు కడు రంజిల్లు అప్సరగాంచినంతన్..' అని పూరించాను.

దీని అర్థం క్లుప్తంగా చెప్పాలంటే సుత్‌రాముడు అంటే ఇంద్రుడు పంపిన మేనక కులుకులు, ఒయ్యారాలు, నాట్యం చూసి విశ్వామిత్రుడి మనసు వశం తప్పింది అని. అర్థమన్నమాట. ఇందులో నాలుగోపాదంలో వాళ్లిచ్చిన పాదం వచ్చింది. రా ముని విడగొట్టడం ద్వారా దాని అర్థం మార్చగలిగాను.

మా నాన్న ప్రోత్సాహం చాలా ఉంది - బి. అపర్ణ

నేను శాంతితోనూ, నా బ్యాచ్‌మెట్ ఉదయచంద్రికతోనే కాక ఒంటరిగా కూడా ముప్పై వరకు అష్టావధానాలు చేశాను. కొత్తలో దత్తపదుల సమస్యను పూరించడమంటే చాలా భయంగా ఉండేది. ఒకసారి మహదేవమణి గారితో కలిసి బెంగుళూరులో చేసిన అష్టావధానంతో దత్తపదులంటే ఉన్న భయం పోయింది. అప్పుడే సచిన్, ద్రవిడ్, గంభీర్, గంగూలీలతో మహాభారత పద్యం పూరించమన్నారు. హతవిధీ...అనుకున్నాను. అది క్షణం సేపే. తేటగీతిలో వెంటనే మొదలెట్టేశాను

ఆ'సచిన్న'ది అయిదు ఊళ్లే అడుగ భీతి
ము'ద్రవిడ'నాడి కౌరవ మోహ మతుల్
అనిని జొచ్చి వే'గంగూలి'రథములౌచు

క్రౌర్య 'గంభీరు'లవ్వారి కర్మమదియే' అని. అరణ్య, అజ్ఞాతవాసములు పూర్తిచేసుకున్న పాండవులు కనీసం ఐదూళ్లన్నా ఇవ్వమని కౌరవులను అడిగారు. వాళ్లు ఇవ్వకపోగా యుద్ధానికి తలపడ్డారు. ఎంత వేగంగా వారు యుద్ధంలోకి దిగారో అంతే వేగంగా కూలిపోయారని ఆ పద్యం అర్థం. ఆ'సచిన్న'ది అంటే ఆశ చిన్నది అని. అందులో సచిన్ వచ్చాడు. భీతి ము'ద్రవిడ'నాడి అనగా..భయమనే భావనే లేకుండా అని. అందులో ద్రవిడు వచ్చాడు. వే'గంగూలి' అంటే వేగంగా నేలకొరిగారు అని. అందులో గంగూలి వచ్చాడు.

చివర క్రౌర్య 'గంభీరు'లవ్వారి అంటే ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని, క్రూరులు అని. అందులో గంభీర్ ఉన్నాడు. ఈ పూరణతోనే దత్తపదులంటే ఉన్న భయం పోయింది నాకు. ఇలాగే ఒకసారి చెప్పు, చేట, పేడ, గాడిదలతో దేవరాయలచే అల్లసానికి సత్కారం చేయమన్నారు. శివశివా..అనుకోలేదు నేను. ఉత్సాహంగా పూర్తిచేశాను.

ఆఖరికి భర్తా మామలు కూడా...

అష్టావధానం అంటే నాకు చిన్నప్పటి నుంచే అవగాహన ఉంది. ఎందుకంటే నాన్నగారు బి.ఎ.మోహన్ వచన కవిత్వం రాస్తారు. అప్పట్లో ప్రతి గురువారం ఆకాశవాణిలో నా పేరుమీద సమస్యా పూరణం పంపేవారు. నాన్నను ఎరిగున్న వాళ్లంతా 'అమ్మాయి పేరుమీద పంపడం కాదయ్యా...అమ్మాయినీ గొప్ప పండితురాలిగా చెయ్యాలి' అనేవాళ్లు. వాళ్లన్నట్టుగానే నాన్న నా చేత పద్యం రాయించడానికి చాలా కష్టపడేవారు.

నాన్న ఆరాటం, సహజంగానే భాషంటే నాకున్న అభిమానం, కాలేజ్‌లో గురువుగారిచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ కూడా నేను అష్టావధానం చేయడానికి ప్రేరణగా నిలిచాయి. పెళ్లయి అత్తింటికి వెళ్లాక భర్త, మామగారి ప్రోత్సాహం కూడా అలాగే ఉంది. ఆలూమగల గిల్లికజ్జాల మీద కూడా పద్యాలు, పాటలు సాగుతుంటాయి మా ఇంట్లో. వీళ్లంతా నా వెనకుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

No comments:

Post a Comment