Sunday, October 3, 2010

'కామన్‌వెల్త్' ఇది అలవాటైన బానిసత్వమా? బతక నేర్చిన లౌక్యమా?

ఎవరి 'కామన్‌వెల్త్' ఇది ?

ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆడే ఒలింపిక్ గేమ్స్ ఉండగా మళ్లీ ఈ కామన్‌వెల్త్ గేమ్స్ ఎందుకు? వలస దేశాలతో సంబంధాలు కొనసాగించాలన్న కోరిక దొరల దేశానికి ఉండొచ్చు, కానీ కొత్త సంకెళ్ళను పోయిన పొడవునా తగిలించుకుని తిరగాలనే కోరిక వలస దేశాలలో ఎందుకు ఉండాలి? ఇది అలవాటైన బానిసత్వమా? బతక నేర్చిన లౌక్యమా? ఒక్క కామన్‌వెల్త్ క్రీడలనే కాదు బ్రిటిష్ పాలకుల పట్ల విధేయతను ప్రకటించే అనేక చిహ్నాలను మనం ఇప్పటికీ మోస్తూనే ఉన్నాం. 63 ఏళ్ల తర్వాత కూడా వలస మెదళ్లతోనే ఆలోచిస్తే ఎలా, ఆ బానిస బూజును ఇంకెన్నాళ్లు దులుపుకోకుండా ఇలా బతుకుతామని ప్రశ్నిస్తున్నారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. వలస పాలకులపై పోరాడిన మనవారి త్యాగాలను, వారసత్వాన్ని మాత్రమే మనం మన 'కామన్‌వెల్త్'గా భావించాలని చెపుతున్న ఆయన వ్యాసమే ఇది.

ఈసారి బ్రిటీష్‌రాణి కోహినూరు కిరీటపు ధగధగల మ«ధ్య జాతి మహాత్మాగాంధీకి నివాళి సమర్పించబోతున్నది. కామన్‌వెల్త్ (అసలు పేరు బ్రిటిష్ ఎంపైర్ కామన్‌వెల్త్) గేమ్స్ ఢిల్లీలో గాంధీ జయంతి మరుసటి రోజు నుంచే ఆరంభమవుతున్నాయి. బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ ఇచ్చిన సామ్రాజ్యవాద అధికార చిహ్నం రాణిబెత్తం (queen's baton) ఒకనాడు బ్రిటిష్ వలస పాలన కింద మగ్గిన కామన్‌వెల్త్ 72 దేశాలలో ఊరేగి ఆ రోజు ఢిల్లీ చేరుకుంటుంది. 'సైమన్ గో బ్యాక్' అన్నందుకు వయోవృద్ధుడైన పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్‌ని చితగ్గొట్టి చంపేసిన బెత్తం అది. కామన్‌వెల్త్ ఆటల చిహ్నంలో ప్రముఖంగా కనిపించేది ఇండియాగేట్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించడానికి చనిపోయిన సైనికులకు స్మారకంగా ఇండియాగేట్‌ను బ్రిటిష్ ప్రభుత్వమే నిర్మించింది. ఈ బెత్తంతో పాటు ఇండియా గేట్ కామన్‌వెల్త్ ఆటలకు చిహ్నంగా ఉండడం యాదృచ్ఛికం కాదు. భారతీయులకు ఇంగ్లీష్ భాష నేర్పినందుకు మనమంతా బ్రిటన్‌కు రుణపడి ఉండాలని సెలవిచ్చిన ప్రధాని మన్‌మోహన్ సింగ్ పాలనలో బ్రిటిష్ రాచరికపు చిహ్నాలకు దౌత్యమర్యాద సహజమే.

ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే లేజర్ ప్రింటర్‌కు పదిహేను రోజుల అద్దె కింద డెబ్బయి వేల రూపాయలు చెల్లించడం వంటి కుంభకోణాలు వందల కోట్ల రూపాయల్లో జరిగినా, కామన్‌వెల్త్ విలాసాల కోసం కోట్లాది రూపాయలు నీళ్లలాగ ఖర్చు చేసినా పెద్ద బాధ కలగడం లేదు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి మూలంగా జాతి పరువు మంట కలవడం వేరే విషయం. స్టేడియం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడం, స్టేడియం ఫాల్స్ సీలింగ్ రాలడం కన్నా ఈ గేమ్స్ కొనసాగింపు వల్ల జాతిగౌరవం మట్టికరవడం ఎక్కువ క్షోభ కలిగిస్తున్నది. జాతిని తిరిగి బ్రిటిష్ బానిసత్వానికి దిగజార్చడం స్వాభిమానాన్ని దెబ్బతీస్తుంది.

63 ఏళ్లు గడిచినా...

బ్రిటిష్ రాచరిక పాలన దేశంలో అంతరించి అరవై మూడేళ్లు గడిచినా అడుగడుగునా సామ్రాజ్యవాద కీర్తన ఇంకా గింగుర్లెత్తుతూనే ఉన్నది. ఒకప్పటి వైస్రాయ్ ప్యాలెస్ అయిన నేటి రాష్ట్రపతి భవన్‌లో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుని విగ్రహం కాని, తైలవర్ణ చిత్రం కాని లేదు. బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్-v, క్వీన్‌మేరీ ఇతర బ్రిటిష్ రాజులు, రాణుల నిలువెత్తు పాలరాతి విగ్రహాలు, బ్రిటిష్ వైస్రాయ్‌ల, గవర్నర్ జనరల్‌ల తైలవర్ణ చిత్రాలు భవనం నిండా ఉన్నాయి. కింగ్ జార్జ్-v రాకకు గుర్తుగా చెక్కించిన భారీ శిలాస్తంభం కూడా ఉన్నది. బ్రిటిష్‌రాణి కిరీటం, ఆమె రజత సింహాసనం, ఆమె బెత్తం... అన్నీ కూడా తిరిగి భారత్ గడ్డ మీదికి, గద్దె మీదికి వస్తామన్నట్లు బెదిరిస్తుంటాయి. పార్లమెంటులో మాదిరి ఒక గాంధీ విగ్రహం, ఒక బిర్సాముండా విగ్రహం, ఒక పటేల్ విగ్రహం వంటివి రాష్ట్రపతి భవన్‌లో పెట్టాలనే స్పృహ మన పాలకులకు ఇంకా కలగలేదు. అంటే మనం మానసికంగా ఇంకా వలసపాలనలోనే జీవిస్తున్నాం.

పేర్లన్నీ తెల్లదొరలవే...

దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు అన్నీ ఇంకా వలసపాలకుల పేర్లతోనే కొనసాగుతున్నాయి. కర్జన్ రోడ్, (చార్లెస్)క్యానింగ్ రోడ్, డూప్లే రోడ్, వెల్లింగ్టన్ రోడ్ వంటి సామ్రాజ్యవాద అవశేషాలు స్వతంత్ర దేశ రాజధానిలో మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. సర్ కనాట్ పేరు మీద వెలిసిన వాణిజ్య సముదాయానికి మరమ్మత్తుల కోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ అదే పేరు కొనసాగిస్తున్నారు. లేడీ హార్డింగ్ హాస్పిటల్, బట్లర్ స్కూల్ ఇంకా అవే పేర్లతో మనలను వెక్కిరిస్తున్నాయి. కేజీ రోడ్ అంటే కస్తూర్బా గాంధీ రోడ్ అయితే సంతోషిస్తాం గాని కింగ్‌జార్జ్ రోడ్ అయితే కలిగే బాధ స్వాతంత్య్ర ప్రియులకే తెలుస్తుంది. ఒక కిత్తూరు రాణి చెన్నమ్మ పేరు, ఒక సంగోలి రాయన్న పేరు, ఒక రాంజీ గోండు పేరు, ఒక సీతారామరాజు పేరు, ఒక వీరపాండ్య కట్టబొమ్మన పేరు ఢిల్లీ రోడ్లకు ఈనాటికీ లేకపోవడం పరిపాలకుల దివాలా మానసిక స్థితికి మచ్చుతునక. ఈ వీరులెవరో అప్పటి బ్రిటిష్ పాలకులకు బాగా తెలుసు. కానీ నేటి మన పాలకులకు అసలే తెలియదు. సిపాయిలను తిరుగుబాటును అణచడానికి హిందూ, ముస్లింలను విడదీసే కుట్ర చేసిన ఛార్లెస్ క్యానింగ్ పేరుమీద ఇప్పటికీ ఒక రోడ్డు సాగడం, బహదూర్ షా జఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించి తెల్లదొరలు తెల్లబోయేటట్టు జాతినంతటినీ ఏకం చేసిన యశ్వంతరావ్ హోల్కర్ పేరు మీద రోడ్డు లేకపోవడం మానసిక బానిస రాజ్యానికే సాధ్యం.

'జ్యోతి'కో నీతి

ఇండియాగేట్ బ్రిటిష్ సామ్రాజ్యానికి చిహ్నం అయితే దానిమీద తిరుగుబాటు చేసి చనిపోయిన సిపాయిల శౌర్యానికి ప్రతీక కాశ్మీర్ గేట్ వద్దనున్న స్మారక చిహ్నం. కాని ఇండియాగేట్ మీద చూపుతున్న శ్రద్ధ కాశ్మీరీగేట్ మీద చూపకపోవడం దేశభక్తి రాహిత్యం. ఇండియాగేట్ వద్ద ఆరిపోకుండా వెలుగుతున్న 'అమర్‌జవాన్ జ్యోతి'కి నిరంతరం వంట గ్యాస్ ఉచితంగా సరఫరా చేయడం సహించగలం. కాని అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలులో వెలుగుతున్న 'స్మృతిజ్యోతి'కి నిరంతరంగా గ్యాస్ అందజేయడం శుద్ధ దండుగ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సెలవివ్వడం ఘోరం. బ్రిటిష్ పాలకులు నివసించిన ప్రాసాదాల్లోనే ప్రధాన మంత్రి, మంత్రులు నివసిస్తున్నందువల్ల తెల్లదొరల ప్రేతాత్మలు వారిని ఆవహించి ఉండవచ్చు. అందుకే తల్లి రొమ్ము తంతున్నారు.

భారత సైన్యం ఒకప్పుడు బ్రిటిష్ సైన్యంలో భాగం. జనరల్ కరియప్ప, జనరల్ ఎస్.ఎం. శ్రీనగేశ్, జనరల్ తిమ్మప్ప, జనరల్ జె.ఎన్. చౌదురి వంటివారు బ్రిటిష్ ఆర్మీ అకాడమీ(లండన్)లో శిక్షణ పొందినవారే. భారత సైన్యంలోని రెజిమెంట్లు (డోగ్రా, జాట్, కుమావూ, రాజ్‌పుత్, అసోం, గఢ్‌వాల్, గూర్ఖా, మద్రాస్ రెజిమెంటు వంటివి) అన్నీ దేశంలో ఎక్కడో ఒకచోట పెల్లుబికిన స్వాతంత్య్ర పోరాటాల్ని అణచడానికి ఏర్పడినవే. ఈ రెజిమెంట్ల స్థాపన దినోత్సవం (రైజింగ్ డే) ఘనంగా నేటికీ జరుపుకోవడం స్వాతంత్య్ర పోరాటాన్ని ఈసడించుకోవడమే.

ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో వేలాది యుద్ధఖైదీలను ఫిరంగి నోళ్ళకు కట్టి పేల్చివేసిన క్రూరులు జనరల్ హెన్రీ హావెలాక్, జనరల్ నీల్, జనరల్ హెన్రీ లారెన్స్, జేమ్స్ ఔట్రామ్ వంటివారు. వారి పేర్లమీద లక్నో, కాన్పూర్, ఢిల్లీ, అండమాన్‌లలో రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు, దీవులు, కాలనీలు ఉండడం పాలకుల చర్మం నీటిగుర్రం, ఖడ్గమృగాల కన్నా మందమని రుజువు చేస్తున్నది.

ఆకలి చావులకు కారకులై...

కామన్‌వెల్త్ ఆటలను బ్రిటిష్ రాణి బెత్తపు నీడలో జరుపుకుంటున్న సమయంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల దౌష్ట్యాలన్నిట్నీ మననం చేసుకోవడం అవసరం. దేశంలో నాడయినా నేడయినా ప్రతి మనిషికి సరిపోయినంత తిండి గింజలు సమృద్ధిగా ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు రావడానికి ముందు దేశంలో ఆకలిచావులు మచ్చుకు కూడా లేవని స్వామి వివేకానంద అన్నారు. జొన్నలు, ఇతర తిండిగింజల బదులు బ్రిటిష్ పాలకులు బలవంతంగా రైతుల చేత నీలిమందు, పత్తి పంటలు వేయించారు. అయినా ఏ ఊర్లో జొన్నపంట ఆ ఊరి ప్రజలకు సరిపోయేది. కాని జనానికి కొనుగోలు శక్తి ఉండేది కాదు. పంటలో సగం ప్రజల నుంచి బలవంతంగా పన్నుగా వసూలు చేసేవారు. నిజాం రాజ్యంలో అది 'చౌత్' (నాలుగోవంతు) మాత్రమే. నిర్బంధ పన్ను వసూళ్ల వల్లనే ప్రజలు తరచూ కరువువాత పడ్డారు. క్రీ.శ. 1770 నుంచి 1900 వరకూ దేశంలో కరువు వల్ల రెండు కోట్ల యాభై లక్షల మంది చనిపోయారు. వీరిలో ఒక కోటి యాభై లక్షల మంది 1877, 1889, 1897, 1900 సంవత్సరాల్లో వచ్చిన కరువుల మూలంగా చనిపోయారు. ప్రజల ఆకలి తీర్చడానికి, కొనుగోలు శక్తి పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఆ సమయంలో బ్రిటన్‌లో వసూలైన పన్నులకన్నా ఎనిమిది రెట్ల పన్నును వాళ్లు రాణి బెత్తం చూపి బెదిరించి ఇండియాలో వసూలు చేసుకుని లండన్ దోచుకెళ్లారు.

రోగాల బారిన కోట్లాది మంది...

అప్పట్లో భారత గణాంక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విలియమ్ హంటర్ బ్రిటిష్ ప్రభుత్వం వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో కళ్లకు కట్టినట్టు వివరించారు. 1918లో బిట్రిష్ ప్రభుత్వం మనదేశంలోని 24 కోట్ల ప్రజల వైద్యానికి 50 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. అంటే తలా రెండు సెంట్లు మాత్రమే. విదేశాల నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి మూలంగా దేశంలో 1901లో రెండు లక్షల 70 వేల మంది చనిపోగా మరుసటి సంవత్సరం 50 లక్షల మంది చనిపోయారు. 1903లో ఎనిమిది లక్షల మంది, 1904లో పది లక్షల మంది మరణించారు. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి 1918లో 12 కోట్ల మందికి సోకగా, ఒక కోటి 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. మందు లేకపోయినా పౌష్టికాహారం లభించి ఉంటే మరణాల శాతం గణనీయంగా తగ్గి ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వ రాక్షస విధానాలు గుర్తు చేసుకుంటే కామన్‌వెల్త్ ఆటలు ఏ బానిసత్వం కొనసాగింపో తేటతెల్లం అవుతుంది.

ప్రసూతి రోగాలు, మరణాల గురించి చెప్పనవసరం లేదు. ప్రసూతి తరువాత తల్లులు, పిల్లలు నూటికి ఐదుగురు చచ్చిపోయేవారు. ఎనిమిదేళ్లు నిండకముందే బెంగాల్‌లో వెయ్యికి 500 మంది, బొంబాయి ప్రావిన్స్‌లో వెయ్యికి 666 మంది పిల్లలు చనిపోయేవారు. ఇతర కారణాల వల్ల 1921లో ఇంగ్లండ్‌లో వెయ్యికి 13 మంది, అమెరికాలో వెయ్యికి 12 మంది చనిపోతే, ఇండియాలో 32 మంది పిల్లలు చనిపోయారు. దేశంలోని 24 కోట్ల జనాభాలో కనీసం నాలుగు కోట్ల మంది ఏళ్లకొద్దీ సగం కడుపు కూడా నిండక మలమల మాడిపోయారు. ఇప్పుడు కూడా గోదాముల్లో 6 కోట్ల టన్నుల తిండిగింజలు ఒకవైపు మురిగిపోతుంటే, మరోవైపు 60 కోట్ల ప్రజలు తిండిలేక అలమటిస్తుంటే వైస్రాయ్ (రాష్ట్రపతి)ను భవన్ అధిష్టించిన వలసపాలకుల వారసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రజలకన్నా ఆస్ట్రేలియా వీట్ బోర్డ్, కార్జిల్ కంపెనీ, రిలయన్స్ కంపెనీల లాభా లే ముఖ్యమని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా వీట్ బోర్డ్ అంటేనే ఎగుమతులు, దిగుమతుల లావాదేవీల్లో భారీ లంచాలకు పర్యాయపదం.

మన మగ్గాలు విరగ్గొట్టి...

లాంక్‌షైర్, యార్క్‌షైర్, మాంచెస్టర్ మిల్లుల వస్త్రాలకు భారత్‌లో చేనేత మగ్గాలు పోటీ కావడంతో బ్రిటిష్ పాలకులు మన మగ్గాల్ని విరగ్గొట్టారు. అప్పటికీ చేనేత కార్మికులు ఏదో విధంగా తమ వృత్తి కొనసాగిస్తుంటే, వారి చేతులు నరికేశారు. వైస్రాయ్‌గా ఇండియాకొచ్చిన విలియమ్ బెంటిక్ "చేనేత కార్మికుల కళేబరాలతో భారతదేశం తెల్లబడిపోయింద''ని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన వస్త్రం మీద పైసా పన్ను లేదు కాని ఇండియాలో మగ్గం మీద తయారైన వస్త్రాలకు అడుగడుగునా పన్నే. గింజ నుంచి పత్తిని వేరుజేస్తే పన్ను; పత్తిని నూలుగా వడికితే పన్ను; నూలును వస్త్రంగా నేస్తే పన్ను; వస్త్రం అమ్మకానికి తాలూకా దాటితే పన్ను; జిల్లా దాటితే మరోసారి పన్ను; ప్రావిన్స్ దాటితే మళ్లీ పన్ను. స్వదేశీ నేతవస్త్రం ధరను ఇంగ్లండ్ వస్త్రం ధర కన్నా కృత్రిమంగా పెంచాలనేది పాలకుల కుట్ర.

స్వదేశీ గుత్త పెట్టుబడిదారుల యాజమాన్యంలోని టెక్స్‌టైల్ మిల్లులు, విదేశీ కంపెనీలు దేశంలో డంప్ చేసిన దుస్తులు ఈనాటికీ మన చేనేత వస్త్రాలను పోటీ నుంచి నెట్టేస్తూనే ఉన్నాయి. అందువల్ల చేనేత కార్మికులు కూడా చౌకైన మిల్లు దుస్తులే ధరిస్తున్నారు.

అవినీతికి మారుపేరు

ఈస్టిండియా కంపెనీ రాబర్ట్ క్లయివ్ నాయకత్వంలో అత్యంత రాక్షసంగా వ్యవహరించింది. క్లయివ్ వ్యక్తిగతంగా పగ్గాల్లేని అవినీతికి ఒడిగట్టాడు. కోట్లాది రూపాయలు స్వదేశీ పాలకుల దగ్గర లంచం తీసుకుని సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను చంపి ఆ స్థానంలో మీర్ జాఫర్‌ను కూర్చోబెట్టడానికి 61 లక్షల 93 వేల పౌండ్లు లంచం తీసుకున్నాడు. మీర్ జాఫర్‌ను దించి, గద్దె మీద మీర్ ఖాసింను కూర్చోబెట్టడానికి క్లయివ్ వారసులు 11 లక్షల 52 వేల పౌండ్లు లంచం తీసుకున్నారు. ప్రజల వద్ద కూడా గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేశారు. పన్నులు కట్టలేక అనేక గ్రామాల్లో మూడింట రెండు వంతుల మంది రైతులు పారిపోయారు. పారిపోలేని వారిని బహిరంగంగా బోనుల్లో బంధించారు.

ఈస్టిండియా కంపెనీ ఐదు కోట్ల రూపాయల సరుకు ఇంగ్లండ్ నుంచి తెచ్చి ఇండియాలో రెండు వందల కోట్లకు అమ్ముకుంది. ఇండియాలో రెండు కోట్ల రూపాయలకు ఖరీదు చేసిన సరుకును ఇంగ్లండ్‌లో వంద కోట్ల రూపాయలకు అమ్ముకుంది. ఫలితంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈస్టిండియా కంపెనీ షేరు విలువ 32 వేల పౌండ్లకు పెరిగింది. మదుపుదారులందరూ భారీ డివిడెండ్లతో లూటీలో భాగస్వాములైనారు. క్లయివ్ అవినీతి మెకాలే విచారణలో బయటపడినా బ్రిటిష్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. మళ్లీ మళ్లీ మెకాలే కేసులు పెట్టి వెంటపడడంతో తట్టుకోలేక క్లయివ్ ఉరేసుకున్నాడు. క్లయివ్ దుర్మార్గాలను ఉపేక్షించి, క్షమాభిక్ష పెట్టిన బ్రిటిష్ రాణి కిరీటాన్ని, బెత్తాన్ని కామన్‌వెల్త్ ఆటల చిహ్నంగా నెత్తిన పెట్టుకోవడం దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతున్నదని అన్యాపదేశంగా అంగీకరించడమే.

భారతీయులకు విద్యాగంధం అబ్బాలని ప్రయత్నించినట్టు చెప్పుకున్న మెకాలే కూడా ప్రాథమిక విద్య కోసం మాత్రమే ప్రయత్నించాడు. ఉన్నత విద్య భారతీయులకు అవసరం లేదని వాదించాడు. బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో తలా ఎనిమిది సెంట్లు మాత్రమే విద్య కోసం కేటాయించింది. అదీ ఇంగ్లీషు నేర్పే విశ్వవిద్యాలయాల కోసమే. దేశంలో సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశ పెట్టాలని 1911లో గోపాలకృష్ణ గోఖలే పార్లమెంట్‌లో ప్రైవేటు ముసాయిదా చట్టం ప్రవేశపెడితే ఆ ప్రభుత్వం తిరస్కరించింది. పటేల్ కూడా ఇటువంటి బిల్లును 1916లో మళ్లీ ప్రవేశపెడితే అది కూడా వీగిపోయింది.

ప్రజలను తిండికీ, చదువుకూ, వైద్యానికీ దూరం చేసి సమున్నతమైన భారతీయ నాగరికతను ధ్వంసం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక కుటిలయత్నాలు చేసింది. మొట్టమొదట సంస్కృతిని నాశనం చేయచూసింది. బ్రిటిష్ వారిలాగా దుస్తులు ధరించి, కత్తులు, చెంచాలు, ముళ్ల చెంచా(ఫోర్క్)లతో బ్రెడ్, బటర్, జామ్ తిని, వారి భాష వారి యాసలో మాట్లాడి, వారి నమ్మకాలు అంగీకరించి, వారి పండుగలు జరుపుకునే మనస్తత్వం అలవరిస్తే భారతీయులతో ఏ పనైనా (నేటి రోబోల మాదిరి) చేయించుకోవచ్చని మెకాలే సెలవిచ్చాడు. రోబోలకు పునరుత్పత్తి శక్తి ఉందని, రోబోలకు తిరిగి రోబోలు పుడతాయని నేటి పాలకులు చాటుతున్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులందరూ ఉపమానవుల వలె బతికు ఈడ్చి ఉండవచ్చు. కానీ ఉద్వేగం లేని రోబోల వలె తిరుగాడలేదు. కామన్‌వెల్త్ ఆటల నిర్వాహకులు మాత్రం రోబోలకన్నా అధ్వాన్నంగా మెదడు, గుండె క్లోక్‌రూమ్(సామాన్ల గది)లో కొక్కానికి తగిలించి యంత్రాల మాదిరి బ్రిటిష్ రాణి బెత్తం మోస్తున్నారు. జాతి ఒకప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తే పాలకులు ప్రస్తుతం స్వదేశీ వస్తు బహిష్కరణ చేస్తున్నారు.

త్యాగాలే మన ఉమ్మడి సొత్తు...

కామన్‌వెల్త్ అంటే అర్థం ఉమ్మడి సంపద. ఇండియా సంపద, మిగతా 71 దేశాల సంపద ఇంగ్లండ్‌కు ఉమ్మడి సంపదే. కానీ ఇంగ్లండ్ సంపద ఈ దేశాలకు ఉమ్మడి హక్కు కాదు. భారతదేశం నుంచి వసూలు చేసుకుని తీసుకునిపోయిన నగదు పన్నులను తిరిగి ఇవ్వాలిన అవసరం వారికి లేదు. కోహినూర్ లాంటి విలువైన సంపదనూ తిరిగి ఇవ్వరు.

క్రాంతివీర్ వాసుదేవ్ బల్వంత్ ఫడ్కేను అరేబియా ఎడారిలో చంపినందుకు, భగత్‌సింగ్‌ను ఉరితీసినందుకు, వేలాదిమంది దేశభక్తులను సెల్యులార్ జైలులో చిత్రహింసలు పెట్టినందుకు బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి క్షమాపణలు చెప్పినాకయినా కామన్‌వెల్త్ గేమ్స్ గురించి ఆలోచిస్తే ఉచితంగా ఉండేది. ఒక శతాబ్దం తరువాత కూడా వలస పాలన అవశేషాలను తిరస్కరించకపోవడం దారుణం. మనం మన జాతీయతను, సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి. జస్టిస్ వెంకటాచలయ్య అభిప్రాయపడినట్లుగా భారతదేశం ఒక సమాఖ్యల సమాఖ్య (మహాసమాఖ్య). జాతీయత కొరవడి బానిస భావజాలంలోనే జాతి నాయకత్వం కొట్టుమిట్టాడితే అనేక జాతులు, భాషలు, సంస్కృతులకు నిలయమైన దేశం విచ్ఛిన్నమవుతుంది. విదేశీయులపై పోరాటంలో అమరులైన వారిని, వారి వారసత్వాన్ని, త్యాగాలను ఉమ్మడి సొత్తు(కామన్‌వెల్త్)గా, ఉమ్మడి ఉద్వేగంగా జాతి భావించిన నాడే ప్రజల మధ్య మానసిక తాదాత్మ్యత ఏర్పడి జాతి అఖండంగా నిలుస్తుంది. వికసిస్తుంది.

నిర్లిప్తత పనికిరాదు

ఆటల పోటీలలో విజయం సాధించడానికి క్రీడాకారులకు ప్రేరణ జాతీయభావం. చిన్న దేశాలైనా, జాతీయత నిలుపుకున్న దేశాలే ఎక్కువ పతకాలు సాధిస్తున్నాయి. ఎంత ఖర్చు చేసి, ఎన్ని వసతులు కల్పించినా, ఎంత నాణ్యమైన శిక్షణ ఇప్పించినా క్రీడా సౌధాలు ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్‌తో పేకమేడల వలె కుప్పకూలుతాయి. ప్రభుత్వంలో పెద్దలు, క్రీడల నిర్వాహకులు, క్రీడాకారులు ఎంత అవినీతిలో కూరుకుపోయినా వారికి శిక్షల్లేవు. ప్రజల నుంచి ప్రతిఘటన లేదు. నిర్లిప్తతే మన జాతీయ లక్షణంగా మారింది. దేశ విముక్తి కోసం నాటి కార్యశూరులు సాగించిన జాతి ఏకీకరణ కృషిని, వారి త్యాగాలను, అమరత్వాన్ని మననం చేసుకుంటేనే కర్తవ్య స్పృహ కలుగుతుంది. సామ్రాజ్యవాదుల కామన్‌వెల్త్ బదులు జాతి ఉమ్మడి సంపద సాక్షాత్కారమవుతుంది.

No comments:

Post a Comment