Thursday, February 9, 2012

కలలకు వ్యవధి ఏదీ...



మనకున్న ఫైర్‌బ్రాండ్ నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. క్రీడా మంత్రిగా పనిచేసినా, రైల్వే మంత్రిగా ఉన్నా, ప్రస్తుతం బెంగాల్ ముఖ్యమంత్రి అయినా - మమత ఎప్పుడూ సంచలనమే. కమ్యూనిస్టులకు పెట్టని కోటలాంటి బెంగాల్‌లో పాగా వేసిన ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మమత రాజకీయ ప్రస్థానం గురించి మోనిబినా గుప్తా రాసిన పుస్తకం 'దీది'. ఈ పుస్తకంలోని ఆసక్తికరమైన విశేషాలే ఈవారం ఓపెన్‌డయాస్...

(జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలలోను, సుఖఃదుఖాలలోను మమతకు తోడుగా నిలిచింది ఆమె కుటుంబ సభ్యులే. తన జ్ఞాపకాలలో కూడా మమత ఈ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది)
మమతకు వాళ్ల అమ్మకు మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువ. "మమత వాళ్ల అమ్మగారికి ఎనభై ఏళ్లు. ఆమె అంటే మమతకు చాలా అనురాగం..ఆమెకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది'' అంటారు కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ. "ఈ రోజుకు కూడా ఎక్కడికైనా వెళ్లే ముందు, అమ్మ దగ్గరకు వెళ్లి పదిరూపాయలు అడిగి తీసుకుంటుంది'' అని ఆయన వెల్లడించారు. మమతకు కాళీఘాట్‌లో ఒక ఇల్లు ఉంది.

ఆమె అన్నలు, వదినలు, మేనకోడళ్లు, మేనళ్లులు- అందరూ అదే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తారు. "నా మొత్తం సమయమంతా రాజకీయాలకే సరిపోతుంది. నేను కోల్‌కత్తాలో ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్లకు విశ్రాంతి లభించదు. చాలామంది అర్థరాత్రి.. అపరాత్రి అని లేకుండా ఏదో ఒక పని మీద కలవటానికి వస్తూ ఉంటారు. వీరందరి వల్ల మా అమ్మకు నిద్రపోవటానికి కూడా ఉండదు. కానీ మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. వారికి రాజకీయాలంటే ఎలా ఉంటాయో తెలుసు'' అని మమత ఒక చోట పేర్కొన్నారు.

మమత మొదట్నించి తన తోటి వారి కన్నా భిన్నంగా ఉండేది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మిగిలిన వారందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మమత మాత్రం దూరంగా ఒక మూల కూర్చునేది. పదో క్లాసులో స్నేహితులందరూ ఇంటర్‌లో జాయిన్ కావాల్సిన కాలేజీ గురించి, మేకప్ గురించి బాతాఖాని వేసుకుంటుంటే మమత మాత్రం తనకున్న సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండేది. "మా అమ్మకు ఒంట్లో బావుండేది కాదు.

అందువల్ల ఉదయాన మూడున్నరకే లేవాల్సి వచ్చేది. మొత్తం వంట చేసి చెల్లెళ్లను, అన్నయ్యలను నిద్రలేపేదాన్ని. వారందరూ తయారయిన తర్వాత నేను కూడా తయారయ్యేదాన్ని. అతికష్టం మీద టైంకు స్కూలుకు వెళ్లగలిగేదాన్ని. స్కూలు అయిన వెంటనే రాత్రి వంట చేయటానికి వెంటనే ఇంటికి వచ్చేసేదాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు భవిష్యత్తు గురించి కలలు కనటానికి సమయం ఎక్కడ దొరుకుతుంది'' అని ఒక చోట మమత తన చిన్ననాటి రోజుల గురించి వర్ణించారు.

(మమతకు ప్రేమ పట్ల నమ్మకం లేదా? చిన్నప్పుడు ఎప్పుడూ ప్రేమలో పడలేదా? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి కూడా ఈ పుస్తకం ప్రయత్నించింది..)
స్కూలులోను, కాలేజీలోను చదివే రోజుల్లో మమత స్నేహితులు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తూ ఉండేవారు. కొందరు ప్రేమవ్యవహారాలు నడుపుతూ ఉండేవారు. మరి మమత మాటేమిటి? ప్రేమకు కేటాయించటానికి ఆమె దగ్గర సమయం లేదా? లేక అలాంటి భావనలను అణగదొక్కేసిందా? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి..

మమత రాసిన ఏకాంత (ఒంటరిగా..) అనే పుస్తకంలో ఇలాంటి సంఘటనలు కొన్నింటిని మనం చూడచ్చు. మమత స్కూలుకు వెళ్లే రోజుల్లో భారతీ దీదీ అనే ఆవిడ మమతను తీసికెళ్లడం, తిరిగి తీసుకురావడం చేస్తుండేది. ఒక రోజు భారతీ దీదికి ఒంట్లో బావులేక రాలేదు. దీనితో మమత ఒంటరిగా స్కూలుకు వెళ్లాల్సి వచ్చింది. స్కూలు నుంచి తిరిగి వస్తున్న సమయంలో మిగిలిన స్నేహితులు పార్క్ గోడ మీద కూర్చుని ఉన్న కుర్రాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్లు ఎవరని మమత తన స్నేహితులను అడిగింది.

వారు తమ స్నేహితులని, తమ ప్రేమికులని చెప్పారు. "వాళ్లు ఆ మాట చెప్పేసరికి నాకు ప్రాణం పోయినంత పనయింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోయా. ఆ తర్వాత భారతీదీది లేకుండా స్కూలుకు వెళ్లలేదు. ప్రేమికులకు అర్థమేమిటో ఎవరినీ అడగలేదు కూడా. అలా అడిగితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని భయపడ్డా. నేను ఈ విషయాలను నాలోనే దాచుకున్నా. ఆ తర్వాత నా స్నేహితులతో కలిసి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు'' అని మమత 'ఏకాంత' పుస్తకంలో పేర్కొంది.

(మమత అలవాట్లు ఏమిటి? ఆమె రాత్రిళ్లు ఎందుకంత సేపు మెలకువగా ఉంటారు)
మమత సాధారణంగా రాత్రిళ్లు ఎక్కువ సేపు నిద్రపోరు. చాలా పొద్దుపోయే వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమెకు ఈ అలవాటు పోలేదు. 1990లలో మమత తలకు గట్టి దెబ్బ తగిలింది. మృత్యువు సమీపంలోకి వెళ్లి వచ్చింది. బహుశా అప్పటి నుంచి రాత్రిళ్లు మెలుకువగా ఉండే అలవాటు ఆమెకు వచ్చి ఉండచ్చు. "ఆమె ఆ సమయంలో ఎంపీగా ఢిల్లీలో ఉండేది.

ఆమె ఆ దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో అనేక రాత్రిళ్లు ఆమెకు తోడుగా ఉండేవాళ్లం. రవీంద్రసంగీత్ పాడుతూ గడిపేవాళ్లం'' అని తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ కృష్ణబోస్ వెల్లడించారు. రోజులో ఉండే మొత్తం కాలాన్నంతా ఉపయోగించుకోవటానికి మమత ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయాలతో పాటు సంగీతానికి, చిత్రలేఖనానికి, పుస్తకాలు రాయటానికి తన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటుంది. లేకపోతే పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ 23 పుస్తకాలు ఎలా వెలువరించగలుగుతుంది? తాను విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా రాస్తూ ఉంటానని ఆమె చెబుతుంది.

(మమతకు అతీంద్రియ శక్తులంటే చాలా నమ్మకం..దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు..)
అనేక సార్లు రాజకీయ దుష్టశక్తుల నుంచి తృటి ప్రాయంలో తప్పించుకోవటం వల్ల కావచ్చు మమతకు అతీంద్రియశక్తులంటే విపరీతమైన నమ్మకం ఏర్పడింది. తాను జీవించటమే ఒక పెద్ద అద్భుతమని మమత భావిస్తూ ఉంటుంది.

అతీంద్రియ శక్తుల నుంచి శక్తిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 'ఏకాంత' పుస్తకంలో ఆమె ఇలాంటి సంఘటనలనేకం ప్రస్తావించింది. " తారాపీఠ్‌కు వెళ్లి చాలా కాలం అయింది. ఢిల్లీలో ఉన్న సమయంలో నేను తారాపీఠ్‌లో పూజ చేస్తున్నట్లు కల వచ్చింది. లేచిన తర్వాత తారాపీఠ్‌కు ఎప్పుడు వెళ్తే బాగుంటుందని ఆలోచించా. కోల్‌కత్తా తిరిగి వెళ్లిన తర్వాత నాకు వచ్చిన కల గురించి మా అమ్మకు చెప్పా.

అప్పుడు ఆమె ఒక సంఘటన చెప్పింది. కొన్ని రోజుల క్రితం మా ఇంటికి ఒక ముసలామె వచ్చిందిట. ఆమె వెళ్లే ముందు- ''నీ కూతురుని తారాపీఠ్‌కు వెళ్లమని చెప్పు" అని చెప్పిందిట..'' అని మమత ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తనకు కల రావడం, అవ్వ వచ్చి చెప్పడం ఏదో సందేశాన్ని ఇచ్చినట్టు మమత భావించి ఉండొచ్చు. అందుకే వెంటనే ఆమె తారాపీఠ్‌కు వెళ్లి వచ్చారు.
మా అమ్మకు ఒంట్లో బావుండేది కాదు. అందువల్ల ఉదయాన మూడున్నరకే లేవాల్సి వచ్చేది. మొత్తం వంట చేసి చెల్లెళ్లను, అన్నయ్యలను నిద్రలేపేదాన్ని. వారందరూ తయారయిన తర్వాత నేను కూడా తయారయ్యేదాన్ని. అతికష్టం మీద టైంకు స్కూలుకు వెళ్లగలిగేదాన్ని. స్కూలు అయిన వెంటనే రాత్రి వంట చేయటానికి వెంటనే ఇంటికి వచ్చేసేదాన్ని.

No comments:

Post a Comment