
ఆ పాట పాడింది హిందీ సినీ
ప్రపంచంలోని ప్రసిద్ధ నేపథ్య గాయని లతా మంగేష్కర్ అని తెలుసుకుని ఆ పేరును
తెలుగు శ్రోతలు తమ హృదయ పలకం మీద చెక్కుకున్నారు. ఆ తరువాత హిందీ తెలిసిన
వారే కాదు, తెలియని వారు కూడా హిందీ సినీ సంగీతం వినడం అలవాటు
చేసుకున్నారు. ఆ ఒక్కపాటతోనే లత తెలుగు నేల మీద అంత పదిలంగా
నిలిచిపోయారామె.
కొండ శిఖరాల మీదుగా, ప్రవహించే తేనెల జలపాతం లాంటి ఆ గొంతు లోంచి వచ్చిన వేలాది పాటల్ని దేశప్రజలంతా మహానందంతో ఆస్వాదిస్తూ ఉండిపోయారు. లతా మంగేష్కర్ ఏడు దశాబ్ధాలుగా 30 వేలకు పైగా పాటలు పాడి భారతీయ హృదయాలను ఆనంద సీమలో ఓలలాడిస్తూనే ఉంది. అందుకు కృత జ్ఞతగా మన దేశం లతా మంగేష్కర్ను 2001లో 'భారత రత్న' పురస్కారంతో సత్కరించింది.
ఆత్మనాదం
కొండ శిఖరాల మీదుగా, ప్రవహించే తేనెల జలపాతం లాంటి ఆ గొంతు లోంచి వచ్చిన వేలాది పాటల్ని దేశప్రజలంతా మహానందంతో ఆస్వాదిస్తూ ఉండిపోయారు. లతా మంగేష్కర్ ఏడు దశాబ్ధాలుగా 30 వేలకు పైగా పాటలు పాడి భారతీయ హృదయాలను ఆనంద సీమలో ఓలలాడిస్తూనే ఉంది. అందుకు కృత జ్ఞతగా మన దేశం లతా మంగేష్కర్ను 2001లో 'భారత రత్న' పురస్కారంతో సత్కరించింది.
ఆత్మనాదం
మనిషికే కాదు, పాటకు కూడా శరీరం, మనసు, ఆత్మ ఉంటాయనే సత్యం లతాజీ గొంతు విన్న ఎవరికైనా తెలిసిపోతుంంది. గొంతులోంచి వచ్చే శబ్ధం పాట శరీరమైతే, ఆ గొంతులో పలికే భావోద్వేగాలు మనసు. ఆ భావోద్వేగాలకు అతీతంగా ధ్వనించే తాత్వికనాదం ఆత్మ. ఈ ఆత్మనాదమే సంగీతంలో పరమోన్నతమైనది. లత గొంతులో పలికేది ఆ ఆత్మనాదమే. నిజంగా లత గొంతులో పలికే ఆ నాదం ఎన్ని దుఃఖాలను ఓదార్చిందో లెక్కలేదు.
" యే మేరె దిలే నాదాన్- తూ గమ్సే న గబ్రానా
ఏక్ దిన్తో సమజ్లేగీ దునియా తేర అఫ్సానా ''
(ఓ బేల హృద యమా! గాయాలకు అంత గా కుంగిపోకు సుమా!
ఏదో ఒక రోజున లోకం నీ జీవితగాథను అర్థం చేసుకుంటుంది లేమ్మా! )

నిజానికి అప్పటి దాకా వారు గాయనీమణుల స్వర స్థాయి పరిమితులను దృష్టిలో ఉంచుకునే బాణీలు కూర్చేవారు. కానీ, లత ఆగమనం తరువాత ఆ పరిమితుల్ని మరిచిపోయారు. ఎల్లలే లేని, ఎంత ఎత్తులోనైనా పాడగలిగే ఆమె స్వరం రసజ్ఞులను మంత్రముగ్ధుల్ని చేసింది. నిజానికి పాడటానికి స్వరజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం లతా మంగేష్కర్ లో అనంతంగా ఉంది.
"భావ వ్యక్తీకరణకు లత పెద్దగా ప్రాధాన్యమివ్వరు'' అంటూ వ్యాఖ్యానించే వారిలో చాలా మంది ఆమె గొంతులో పలికే భావాతీత స్థితిని గమనించరు. లత ముందు ఒకసారి ఎవరో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు " వృత్తి రీత్యా పాడటం వేరు కాని, సహజంగా ఎవరైనా భయం, బాధ , దుఃఖాల్లో ఉన్నప్పుడు పాడతారా? ఆ భావ్వేద్వేగాలనుంచి తేరుకున్నాకే పాడతారు. నిజమైన గానం అలాగే కదా ఉండాలి! నా మట్టుకు నేను పాడే సమయంలో ఆ విషయాన్నే గుర్తుంచుకుంటాను'' అన్నారు.
ఒంటి కోయిల
తన గాత్రంతో వేలాది పాటల్లో ప్రేమను పొదిగిన లత తాను మాత్రం వాటన్నిటికీ దూరంగానే గడిపేసింది, వేలాది యుగళ గీతాల్లో గొంతు కలిపినా జీవిత మంతా ఒంటరిగా ఒక సోలో గీతంగానే మిగిలిపోయింది. పెళ్లెందుకు చేసుకోలేదని ఎవరో ప్రశ్నించినప్పుడు, సమాధానంగా లత " నేపథ్య గాయనిగా నిలదొక్కుకోవడానికి నేను పడుతూ వచ్చిన సంఘర్షణ, ఆరాటం ఎంత తీవ్రంగా ఉంటూ వచ్చాయీ అంటే, నాకు జీవనసహచరుణ్ని ఎంచుకునే వ్యవధే లేకుండా పోయింది.
నిజానికి, నేను ఒంటరిగా ఉండిపోవాలనే నా నుదుట రాసి ఉందనే నాకనిపిస్తుంది. ఒకవేళ అందుకు విరుద్ధంగా నా పెళ్లి జరిగినా అది అతి త్వరలోనే విచ్చిన్ణమైపోయేదని కూడా నాకు అనిపిస్తుంది. వాస్తవానికి నేపథ్య గానాన్ని నిరంతరం ఒక సవాలుగా తీసుకునే నాకు సంగీతమే ఒక లోకమైపోయింది. మీరాబాయి కృష్ణున్ని ప్రేమించినంత పిచ్చిగా నేను పాటను ప్రేమిస్తాను. ఈ జన్మకు నాకీ ఆనందం చాలు'' అంటూ బదులిచ్చింది.
పసితనం పాట్లు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో లతా మంగేష్కర్ జన్మించింది. ఆమె తాతయ్య గోవా లోని ' మంగేష్' అనే గ్రామంలోని ఒక గుళ్లో పూజారిగా ఉంటూ నిరంతరం భజనలూ, కీర్తనలూ పాడుతూ ఉండే వాడు. లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్, ఆయన కుంటుంబ వారసులు కూడా ఆ సంగీత పరంపరను కొనసాగిస్తూనే వచ్చారు. లతకు ముగ్గురు చెల్లెల్లు, (ఆశాభోంస్లే, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్) ఒక తమ్ముడు (హృదయనాథ్ మంగేష్కర్) ఉన్నారు.
తాను బాల్యంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో లతకు కుటుంబ భారాన్నంతా తన భుజాల మీదే మేసుకోవలసి వచ్చింది. జీవనాధారానికి తనకు తెలిసిన విద్య సంగీతం ఒక్కటే. అందుకే గొంతు చేత పట్టుకుని కుటుంబంతో సహా లత ముంబయికి చేరుకుంది. అనుకున్నంత వేగంగా ఏమీ జరగక చాలా కాలం దాకా ఇల్లు గడవడం ఎంతో కష్టంగా ఉండేది.
సినిమాల్లో పాడే అవకాశాల కోసం సంగీత కారుల చుట్టూ, రికార్డింగ్ స్టూడియోల చుట్టూ అదే పనిగా తిరగాల్సి వచ్చేది. ప్రయాణమంతా లోకల్ ట్రైన్లోనే. అందుకు కూడా డబ్బులు లేక ఎన్నోసార్లు మైళ్లకు మైళ్లే కాలి నడకన వెళ్లాల్సి వచ్చేది.
ఆత్మవిశ్వాసమే తోడుగా...
'కితీ హసాల్' అనే మరాఠీ సినిమాలో " మాథూ యా ఆడే ఖేల్ సారి '' అన్న పాటను తొలిసారిగా లతా మంగేష్కర్ పాడింది. అప్పడు ఆమె వయసు 12 ఏళ్ల 6 మాసాలు. అయితే పాడానన్న సంతోషమే గానీ, ఆ సినిమాలో ఆ పాటను చిత్రీకరించలేదు. పాడే అవకాశం కోసం 1947 లో ఒకసారి లత, అప్పటి ప్రసిద్ధ స్వరకర్త గులామ్ హైదర్ వద్దకు వెళ్లింది, వెంటనే ఆయన సినీ నిర్మాత రశ్ధర్ ముఖర్జీకి పరిచయం చేశాడు.
ముఖర్జీ లతతో ఒక పాట పాడించి "నేపథ్య గానానికి మరీ ఇంత సన్నటి గొంతు పనికి రాదు.'' అనేశాడు. ఆ మాట విని అవాక్కయిన హైదర్ వెంటనే," చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజున నిర్మాతలందరూ ఈ గొంతు కోసమే పడిగాపులు కాస్తారు'' అన్నాడు. నిరాశాజనకమైన ఆ సంఘటనల్లో లత తన ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటే ఏమయ్యేది? హిందీ సినీ సంగీతం ఎంత నష్టపోయేదో వేరే చెప్పాలా? అయితే లత ఏమాత్ర నిరాశ చెందకుండా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ముందుకే సాగిపోయింది.
ప్రైవేట్ గీతాలకు ప్రాణం
సినిమా పాటలకు కథాబలం, సన్నివేశ బలం ఉండటం వల్ల అవి బాగా జనాధరణ పొందుతాయని చాలా మంది అభిప్రాయం. అందుకే వర్ధమాన గాయనీ గాయకులంతా సినిమాల్లో పాడే అవకాశాలే సమస్తం అనుకుంటారు. ఆ వస్తే వచ్చినట్లు, లేకపోతే జీవితమే వ్యర్థమైపోయినట్లని కూడా అనుకుంటారు. కానీ, ప్రైవేట్ పాటలకు సామాజిక సన్నివేశ బలం ఉంటుంద న్న విషయాన్ని వారు మరిచిపోతారు. ప్రదీప్ రాసిన ఆ పాటను సి. రామచంద్ర స్వరపరిచారు.
లతా మంగేష్కర్ పాడిన " యే మేరె వతన్కే లోగో- జర ఆంఖ్ మె భర్లో పానీ, జో షహీద్ హుయే హై ఉన్కీ జర యాద్ కరో ఖుర్బానీ'' అనే పాటను ఉదాహరణగా తీసుకుంటే ఇది సినిమా పాటల కన్నా మిన్నగా ఆదరణ పొందిన ఒక ప్రైవేట్ గీతమిది. భారత చైనా యుద్ధంలో అమరులైన సైనికుల్ని ఉద్దేశించి సాగే ఈ పాట ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ భారతీయ హృదయాల్లో మారు మోగుతూనే ఉంది.
దీనికి తోడు మీరాబాయి భజనలు, భగవద్గీత శ్లోకాల వంటి మరెన్నో ప్రైవేట్ ఆల్బమ్స్కు లత రూపం ఇచ్చారు. సినీ గీతాలతో సమానంగా ప్రైవేట్ గీతాలను నిలబెట్టవచ్చని లతా మంగేష్కర్ బలంగా చాటి చెప్పారు. వర్ధమాన గాయనీగాయకులంతా ఆమెనుంచి ఆ స్పూర్తి పొందితే ఎంత బావుండును!